బూటుతో కొట్టి బుద్ది చెప్పింది
-తనను వేధించిన టీబీజీకేఎస్ నేతకు చితకబాదిన మహిళ
-పిట్ సెక్రటరీ స్వామిదాస్ను తొలగిస్తున్నాం : టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల
మంచిర్యాల : తనను వేధింపులకు గురి చేస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతకు ఓ మహిళా కార్మికురాలు బూటుతో బుద్ది చెప్పింది. కొద్ది రోజులుగా ఈ వివాదం కొనసాగుతోంది. దీంతో గురువారం ఉదయం షిప్టులో వేధింపులకు గురైన మహిళ బూటు కాళ్లతో తన్ని కార్మికుల సమక్షంలో దేహశుద్ధి చేసి చెప్పు దెబ్బలు కొట్టింది. టీబీజీకేఎస్ ఏరియా వర్క్ షాప్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ కొద్ది రోజులుగా ఓ మహిళకు అసభ్యంగా మెసేజ్లు పంపిస్తున్నాడు. అంతేకాకుండా తనను ఇబ్బందులకు సైతం గురిచేస్తున్నాడు. దీంతో ఆ మహిళ అందరి ముందు దేహశుద్ది చేసింది. మహిళను వేధిస్తున్న ఫిట్ సెక్రెటరీ స్వామి దాసు పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సి ఐ టి యు,ఐ ఎన్ టి ఎస్ సి హెచ్ ఎం ఎస్, ఏఐటీయూసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
స్వామిదాస్ను తొలగిస్తున్నం : మిర్యాల రాజిరెడ్డి
టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ను తొలగిస్తున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను తాము సహించమని వెల్లడించారు. ఇకముందు ఏ నాయకుడు, కార్యకర్త కానీ ఇలాంటి పనులకు పాల్పడితే శిక్షిస్తామన్నారు. తక్షణమే పిట్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామన్నారు. మహిళ చేసిన ఆరోపణల గురించి దీనిపైన పూర్తి విచారణ చేసి శాశ్వతంగా బహిష్కరిస్తామని ఆయన చెప్పారు.