ఆడబిడ్డలకు మేనమామ కేసీఆర్
-ఏడేండ్లలో 10 లక్షల మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు
-102 గ్రామాల్లో సమ్మక్క,సారలమ్మ భవనాలు నిర్మిస్తాం
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : తఎలంగా తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ లెక్కన అండగా ఉన్నాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఆయన చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని 569 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పేదింటి తండ్రి తన బిడ్డ పెండ్లికి అగచాట్లు పడకూడదన్న సంకల్పం నుంచి పురుడుపోసుకున్న అపూర్వ పథకం కళ్యాణ లక్ష్మి అని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదని స్పష్టం చేశారు. గడచిన ఏడేళ్లలో 10 లక్షలమంది పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించినట్లు వెల్లడించారు. ఇంత గొప్ప పథకంపై మహిళలు తమ తమ గ్రామాల్లో చర్చ చేయాలన్నారు. ఈ పథకం ఆవశ్యకత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.
102 గ్రామాల్లో సమ్మక్క,సారలమ్మ భవనాలు..
మహిళల స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలనే గొప్ప లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. సుమారు 15 కోట్ల రూపాయలతో రానున్న రోజుల్లో చెన్నూరు నియోజకవర్గం లోని 102 గ్రామాల్లో 102 సమ్మక్క- సారలమ్మ మహిళా భవన్ లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందులో తొలి విడతలో భాగంగా 36 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలలో మహిళ భవనాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. కొద్ది రోజులలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వీటి నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. మహిళా భవన్ లు పూర్తయిన తర్వాత ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారితో మహిళలకు శిక్షణ ఇప్పిస్తామని స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గ మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.