నాన్న నేను క్షేమమే..
-తల్లిదండ్రులకు క్షేమ సమాచారాలు అందిస్తున్న విద్యార్థులు
-ఉక్రేయిన్లో చిక్కుకున్న విద్యార్థులకు నిత్యం వీడియో కాల్స్
మంచిర్యాల : ఓ వైపు రష్యా, ఉక్రేయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్న విద్యార్థుల కోసం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము క్షేమంగా ఉన్నామని అక్కడ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నారు. నిత్యం వీడియోకాల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. చాలా మంది విద్యార్థులు అక్కడ డాక్టర్ చదివేందుకు వెళతారు. మంచిర్యాల జిల్లా నుంచి సైతం పలువురు విద్యార్థులు వెళ్లారు..
మంచిర్యాల సీఐ కొడుకు అఖిల్..
అఖిల్ మంచిర్యాల సీఐ నారాయణ్ నాయక్ రెండో కుమారుడు. ఎంబీబీఎస్ చదివేందుకు అక్కడికి వెళ్లాడు. కళాశాలో అడ్మిషన్ పూర్తైన తర్వాత విద్యను అభ్యసించేందుకు రెండు నెలల కిందటే వెళ్లాడు. వెళ్లిన రెండు నెలలకే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అఖిల్ కుటుంబ సభ్యులు దిగులుతో ఉన్నారు. తనను ఎలాగైనా ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని. నా గురించి మీరేమి బెంగ పెట్టుకోవద్దని భూక్య అఖిల్ ఉక్రేయిన్ నుంచి వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులకు కాల్ చేసి నిత్యం మాట్లాడుతున్నాడు. దీంతో సీఐ నారాయణ్ నాయక్ కుటుంబ సభ్యులు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు.దాడులు ఉక్రేయిన్ తూర్పు ప్రాంతం వైపు జరుగుతున్నాయని తాము ఉన్న యూనివర్సిటీ పడమర ప్రాంతం వైపున ఉంటుందని అఖిల్ చెబుతున్నాడు. యుద్ధం జరిగే ప్రాంతానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.
సింగరేణి కార్మికుడి కూతురు..
మందనపు స్ఫూర్తి ఎంబీబీఎస్ ఐదో ఏడు చదువుతోంది. తాను తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో నివాసం ఉంటోంది. సింగరేణి కార్మికుడు రామారావు కూతురు. ఐదేండ్లుగా అక్కడే డాక్టర్ కోర్సు చదువుతోంది. ఇది చివరి ఏడాది. వాస్తవానికి ఫిబ్రవరి 27న బయల్దేరి, మార్చి 1న ఇండియాకు రావాల్సి ఉంది. కానీ యుద్ధం నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయింది. తాము అక్కడ సురక్షితంగానే ఉన్నామని స్ఫూర్తి చెబుతోంది.