వైద్య విద్య కోసం ఉక్రేయిన్ ఎందుకు వెళ్తారు…?

ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రేయిన్ యుద్దం నేప‌థ్యంలో మ‌న దేశానికి చెందిన చాలా మంది విద్యార్థులు అక్క‌డ చిక్కుకుపోయారు. అందులోనూ అక్క‌డ మెడిసిన్ చ‌దివేందుకు వెళ్లిన విద్యార్థులు వేల సంఖ్య‌లో ఉన్నారు. మ‌రి ఉక్రెయిన్‌లో మెడిసిన్‌కు ప్రత్యేకత ఏంటీ? ఎందుకు ఇండియా నుంచి వేలాది మంది వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్తున్నారు?

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో 18,000 పైగా భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. వారిలో తెలుగు విద్యార్థులు సుమారు 1500 నుంచి 3000 మధ్య ఉన్నారని స‌మాచారం. వారంతా భారతదేశానికి తిరిగి వచ్చేందుకు ఇక్కడి ప్రభుత్వ సాయం కోరుతున్నారు. భారత ప్రభుత్వం కూడా విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థుల్లో ఎక్కువ మంది అక్కడ మెడిసిన్ చదవడానికి వెళ్లినవారే. మిగతావారు ఇంజనీరింగ్ కోసం వెళ్తుంటారు. అయితే అమెరికా, ఆస్ట్రేలియా, చైనా లాంటి దేశాలు ఉండగా ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు ఎందుకు వెళ్లారన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.

ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీల్లో మెడిసిన్ కోర్సులు చదువుతున్నవారిలో భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. ఉక్రెయిన్ రాజధానికి కీవ్‌కు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలోనే మెడిసిన్ కోర్సుల్లో చేరినవారు ఎక్కువ. ఉక్రెయిన్‌లోని మెడికల్ కాలేజీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు ఉంది. అక్కడి కాలేజీల్లో చదివిన డిగ్రీలు భారతదేశంలో చెల్లుతాయి. ఆ కోర్సుల్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గుర్తించింది.

దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపారు. అక్కడ రెసిడెన్షియల్ కార్డ్, వీసా, ఏజెన్సీ ఫీజు, ప్రయణా ఖర్చులు, వసతి లాంటి ఖర్చులన్నీ మొదటి ఏడాది రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షలు ఖర్చవుతుంది. రెండో ఏడాది నుంచి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఖర్చవుతుంది. మెడికల్ విద్యార్థులు అక్కడే మాస్టర్స్ చదివేందుకు 10 ఏళ్ల వీసా ప్లాన్ చేసుకుంటారు. ఉక్రెయిన్‌లో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ పేరుతో ఉన్న నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇండియాలో ప్రాక్టీస్ చేయొచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like