ఉక్రెయిన్ లో మనోళ్లు సురక్షితమే
-స్వస్థలాలకు రప్పించేలా సత్వర చర్యలు
-ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు
రష్య ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న అదిలాబాద్ ఉమ్మడి జిల్లా వాసులు సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందవలసిన అవసరంలేదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్,నిర్మల్,ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాల నుండి ఉక్రెయిన్ వెళ్లిన విద్యార్థులు మెడిసిన్ స్టూడెంట్స్ పరిస్థితి గురించి ఎంపీ ఆరా తీశారు. శుక్రవారం ఈ మేరకు ఢిల్లీలోని దౌత్య కార్యాలయానికి, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కి లేఖ రాశారు. ఉక్రెయిన్ లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నలుగురు విద్యార్థులు ఉన్నారని వారు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు రష్యా ప్రధానితో చర్చిస్తున్నారని ప్రవాస భారతీయులను ఇబ్బంది పెట్టకుండా సురక్షితంగా ఇండియాకు పంపాలని కోరినట్లు తెలిపారు. దౌత్య కార్యాలయ అధికారులు సైతం పరిస్థితిపై ఆరా తీస్తూ విద్యార్థులను విమానంలో స్వస్థలాలకు పంపించాలా చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికైతే తెలంగాణ విద్యార్థులు అక్కడ క్షేమంగా ఉన్నారని ఎంపీ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎంపి కోరారు.