తెలంగాణలో ఉత్తమ పరిశ్రమగా సింగరేణి
-జల సంరక్షణ పనులకు పురస్కారం
-మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందుకున్న డైరెక్టర్ బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) సూర్యనారాయణ
-నదులపై నిర్వహించిన తొలి జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రదానం
సింగరేణి కాలరీస్ ను మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. బొగ్గు ఉత్పత్తి కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో సింగరేణి పోషిస్తున్న గురుతర బాధ్యతలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
భారత నదీ పరివాహక కౌన్సిల్, ఇండియన్ హిమాలయన్ నదీ పరివాహక మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రెండు రోజులుగా నదులపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. జల సంరక్షణ విభాగంలో ఉత్తమ పరిశ్రమగా సింగరేణి కాలరీస్ ను ఎంపిక చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ లో జరిగిన ముగింపు కార్యక్రమంలో మంత్రి టి.హరీశ్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రముఖ పర్యావరణ వేత్త, మేగసెసె అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ చేతుల మీదుగా సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్, జీఎం(కో ఆర్డినేషన్) సూర్యనారాయణ పురస్కారాన్ని అందుకున్నారు.
జల సంరక్షణకు కృషి చేస్తున్న పలు సంస్థలకు మొత్తం 11 విభాగాల్లో అవార్డులను ప్రకటించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉత్తమ పరిశ్రమ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) విభాగంలో సింగరేణిని అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తి లోనే కాకుండా, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి లోనూ సింగరేణి విజయవంతంగా అడుగుపెట్టిందన్నారు. అలాగే సింగరేణి ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా నదీ జలాల నుంచి ఇసుక వాడకాన్ని తగ్గించేలా ఓవర్ బర్డెన్ డంప్ ల నుంచి ఇసుకను తయారీ చేస్తూ వినియోగిస్తోందని తెలిపారు. దీని వల్ల పర్యావరణ పరిరక్షణకే కాకుండా జల వనరుల సంరక్షణకు సింగరేణి సహకరిస్తోందన్నారు.
సింగరేణి పరిశ్రమ ఉన్న జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా మొక్కలు నాటి తన సామాజిక బాధ్యతలను చాటుకుందని కొనియాడారు. సింగరేణి మైనింగ్ ప్రాంతాల్లో గనుల నుంచి వచ్చే నీటిని వృథా చేయకుండా పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికి వినియోగించే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసిందని తెలిపారు. దీంతో సమీప గ్రామ రైతులకు ఎంతో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు శ్రీరాంపూర్, రామగుండం-2, రామగుండం-3 ఏరియాలలోని పరిసర గ్రామాల్లో 10 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 200లకు పైగా ఇంకుడు గుంతలను కోటి రూపాయలతో నిర్మించినట్లు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కంపెనీలో ఎన్విరాన్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. భూ గర్భ గనుల్లోని నీటిని కాలనీలకు సరఫరా చేస్తూ నీటి సమగ్ర వినియోగానికి కృషి చేస్తున్నారని, చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల తవ్వకాన్ని చేపడుతూ సమీప గ్రామాల్లో భూ గర్భ జలాలను పెంపొందించడంలో సింగరేణి అద్భుత మైన భూమిక పోషించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోనూ నీటి వినియోగాన్ని పొదుపుగా వాడుతూ జల సంరక్షణ చేపడుతోందని కొనియాడారు. కంపెనీ సాధించిన లాభాలతో ఏటా కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ మొక్కలను నాటుతోందని ప్రశంసించారు.
అవార్డు ప్రదానం అనంతరం డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) బలరామ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మార్గనిర్దేశంలో సీఅండ్ ఎండీ ఎన్.శ్రీధర్ సారథ్యంలో కంపెనీ అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. ఏటా దాదాపు రూ.70 కోట్ల సీఎస్ఆర్ నిధులతో సమీప గ్రామాల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు వివరించారు. తాము చేపడుతున్న సీఎస్ఆర్ కార్యక్రమాలను, జల సంరక్షణ లో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరింత బాధ్యతతో తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అవుతామన్నారు.
కార్యక్రమానికి తెలంగాణ జల వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భారత నదీ పరివాహన కౌన్సిల్ అధ్యక్షుడు వి. ప్రకాశ్ రావు అధ్యక్షత వహించారు. వాలంతరి డైరెక్టర్ డాక్టర్ బి. కృష్ణారావు, సింగరేణి చీఫ్ లైజన్ ఆఫీసర్ బి.మహేశ్, అడిషనల్ మేనేజర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.