కలను కూల్చేశారు..
ఉక్రెయిన్ మ్రియాను ధ్వంసం చేసిన రష్యా
ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్దం తీవ్రంగానే సాగుతున్నది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు కురిపించిన రష్యా.. సైనిక బలగాలతో ఒక్కో నగరాన్ని వశం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. రాజధాని నగరం కీవ్ లో విధ్వంసకాండ చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం, ఉక్రెయిన్ తయారీ ‘ఏఎన్-225 మ్రియా’ను రష్యా దళాలు ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ భాషలో ‘మ్రియా’ అంటే కల. తమ కలను రష్యా నాశనం చేసిందని, అయితే, కల ఎప్పటికీ నశించబోదని వారికి చూపిస్తామని ఉక్రెయిన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా దళాలు కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఉక్రెయిన్ ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ తాయరుచేసిన ‘ఏఎన్-225 మ్రియా’ ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందింది.
కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌పోర్టుపై రష్యా జరిపిన దాడిలో మ్రియా విమానం ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా తెలిపారు. కలను తిరిగి నిర్మించుకుంటామని, బలమైన, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలనూ కాపాడుకుంటామని విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది. నిజానికి ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో 80వ దశకంలో(సోవియట్ యూనియన్‌లో ఉండగానే) డిజైన్ చేసింది. 1985లో ఏఎన్-225 మ్రియా సిద్ధం కాగా.. మూడేళ్ల తర్వాత కార్యకలాపాలను మొదలుపెట్టింది. అంతరిక్ష ప్రయోగాల కోసం రూపొందిచినా, సాధారణ కార్గోకు వాడుతున్నారు. సుమారు 640 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉందీ విమానానికి.
రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. రష్యా సైనికుల దాడుల్లో 116 మంది చిన్నారులు సహా మరో 1,684 మంది గాయపడ్డారని తెలిపింది. అదే సమయంలో రష్యన్ సైనికులు సుమారు 4వేల మందిని హతం చేశామనీ ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంది. వాస్తవ గణాంకాలు ఏమిటనేది తేలాల్సి ఉంది.