ఈ ప్రాంతం అన్యాయానికి గురైంది

-ద‌శాబ్దాలుగా పాల‌కుల ధ‌న‌దాహానికి గురైంది
-ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను అణిచివేసి వారు కోట్లు గ‌డించారు
-రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని బొంద పెడ‌దాం
-నిప్పులు చెరిగిన ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

మంచిర్యాల : ఈ ప్రాంతం ఎన్నో ద‌శాబ్దాలుగా అన్యాయానికి గురైంద‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. మంద‌మ‌ర్రిలో బిజెపి మంద‌మ‌ర్రి పట్టణ అధ్యక్షులు మద్ది శంకర్, జైపూర్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు చిప్పకుర్తి వెంకన్న‌తో స‌హా ఆయా పార్టీల‌కు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రినీ కండువాలు క‌ప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం గత పాలకుల ధన దాహానికి గురైంద‌న్నారు. సూట్లు బూట్లు వేసుకొని కార్పొరేట్ రాజకీయాలతో ఈ ప్రాంత ప్రజలను అణచి వేసి కోట్లకు పడగలెత్తారు తప్ప.. ఇక్కడి ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని దుయ్య‌బ‌ట్టారు. మెరుగైన రవాణా వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, జాతీయ ర‌హ‌దారి,అడవులు, సింగరేణి, పుష్క‌ల‌మైన జ‌ల వ‌న‌రులు ఉన్నా మన కోల్ బెల్ట్‌ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదని స్ప‌ష్టం చేశారు. గత పాలకులు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ పారిశ్రామికంగా ఎదగనివ్వకుండా చేశారు. వేరే ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు పెట్టి కోట్లు గడించారని అన్నారు. నేడు అదే పాలకులు బీజేపీ ముసుగులో మళ్లీ ఈ ప్రాంత అస్తిత్వంపై దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సింగరేణి నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని ఏ ఒక్క బీజేపీ నాయకులు అడ‌గ‌లేద‌న్నారు. కార్పొరేట్ రాజకీయాలు చేసే వాళ్లకు సింగరేణి ఒక సంస్థలా కనబడుతుంది. సింగరేణి అనేది ఈ ప్రాంత జీవన విధానమ‌ని, ఎన్నో ఏళ్లుగా ప్రజలతో మమేకమై పెనవేసుకున్న పేగుబంధమ‌ని వెల్ల‌డించారు. పట్టణాన్ని బొందల గడ్డగా మార్చకుండా ఉండాలంటే, వ‌ల‌స‌లు వెళ్లే వారిని ఆపాలంటే మన పట్టణ అస్తిత్వాన్ని, సింగరేణి సంస్థ అని కాపాడుకోవాలని ఈ సంద‌ర్భంగా బాల్క సుమ‌న్ పిలుపునిచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే ఏ ఒక్క బిజెపి నాయకులను ఈ ఏరియాలో తిరగనివ్వమ‌ని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా బీజెపీ ని బొంద పెడితేనే వారి దుర్మార్గపు చర్యలు బంద్ అవుతాయని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. కార్మికుల, కర్షకుల పొట్ట కొట్టడమేనా బిజెపి సిద్ధాంతమ‌ని…? ఆయ‌న ప్ర‌శ్నించారు. సింగరేణి మాది.. మనది.. మనందరిదీ. కార్మికులతో పాటు ప్రజలు కూడా ఏకం అవ్వాల‌ని కోరారు. మందమర్రి పట్టణ ప్రాముఖ్యత కోల్పోకుండా ఉండాలని రూ. 147 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించామ‌న్నారు. సుమారు రూ. 40 కోట్ల‌తో పట్టణంలో మౌలిక వసతుల కల్పన కల్పించామ‌న్నారు.
రూ. 40 కోట్ల రూపాయలతో మందమర్రి పట్టణంలో అర్బన్ భగీరథ పనులు, రూ. 7 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు, రూ. 12.50 కోట్లతో మందమర్రి ఆర్‌వోబీ క‌డుతున్నామ‌ని చెప్పారు. ఈ ఆర్వోబీ ఒక్క ఇల్లు కూల్చకుండా కడుతున్నామ‌ని వెల్ల‌డించారు. రూ. 29.68 కోట్లతో 560 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like