రేపు జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా
ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దం శెట్టి రాజమౌళి
కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణివ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐఎన్‌టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దం శెట్టి రాజమౌళి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని, ఒరిస్సా రాష్ట్రంలోని నైని బ్లాక్ సింగరేణికి విధిగా అప్పగించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపర్ కమిటీ సూచించిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చాలన్నారు. వారికి వెంటనే క్యాడర్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని కోరారు. గని ప్రమాదంలో చనిపోయిన పర్మినెంటు & కాంట్రాక్టు కార్మికులకు స్పెషల్ ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల మెడికల్ రికార్డ్స్ అంతా కంప్యూటర్ లో పొందు పరిచి మెడికల్ అటెండెన్స్ రూల్స్ లో మార్పులు చేయాలన్నారు.
నూతన అండర్ గ్రౌండ్ బొగ్గు బావులు వెంటనే సింగరేణి యాజమాన్యం ప్రారంభించాలని కోరారు. నూతనంగా కట్టబోయే మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మిక కుటుంబాలకు ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మెడికల్ కాలేజీలో 15శాతం సింగరేణి కార్మికుల పిల్లలకు నర్సింగ్, ఫార్మసీ సీట్ల కేటాయించాలని కోరారు. సీఎం పిఎఫ్ ట్రస్ట్ లో జరుగుతున్న అవకతవకల పై జాతీయ కార్మిక సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనల మేరకు అవకతవకలను వెంటనే సరి చేయాలి…లెక్కల చీటీలు ప్రతి సంవత్సరం విధిగా కార్మికులకు అందించాని కోరారు. పెరిగిన వడ్డీ రేట్లు బ్యాక్ తేదీ నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కొత్తగా కారుణ్య నియామకాల ద్వారా 9 వేల మంది డిపెండెంట్ కార్మికులు ఉద్యోగంలోకి చేరిన బదిలీ వర్కర్స్ కు విద్యార్హతను బట్టి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మిషనరీ పై పరిపాలన శాఖలో వారికి అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లతో జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని వెల్లడించారు.