రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ !
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భారత్ తన పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపుతోంది. భారత యుద్ధ విమానాల ద్వారా అత్యంత త్వరగా పౌరులను స్వదేశానికి తీసుకు రావడానికి భారత్ చర్యలు ప్రారంభించింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన వరుస పెట్టి అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి “ఆపరేషన్ గంగా” ను ప్రారంభించింది. ‘ఆపరేషనల్ గంగా’ కింద కొనసాగుతున్న తరలింపు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే ప్రయత్నాల్లో చేరాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం భారత వైమానిక దళానికి పిలుపునిచ్చారు. “మా వైమానిక దళ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం వలన తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించడానికి వీలవుతుంది. ఇది మానవతా సహాయాన్ని మరింత సమర్ధవంతంగా అందించడంలో కూడా సహాయపడుతుంది” అని ప్రధాని మోడీ అన్నారు.
దీంతో భారత వైమానిక దళం కొన్ని సీ-17 విమానాలను మోహరించనుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై గత 24 గంటల్లో జరిగిన మూడో అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపాలనే నిర్ణయం తీసుకున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో సుమారు 16,000 మంది విద్యార్థులు, భారత పౌరులు చిక్కుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రభుత్వం 9 ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను తరలిస్తోంది.
ఇప్పటి వరకు 8,000 మందిని ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తరలించారు. ఇప్పటివరకు ప్రత్యేక విమానాలు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నాయి. ఇక ప్రపస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగితే.. చాలా మంది భారత పౌరులు, విద్యార్థులను చాలా త్వరగా ఇండియాకు తీసుకురావడానికి వీలు కలుగుతుంది. భారత వైమానిక దళానికి చెందిన C-17 విమానాలు మంగళవారం నుంచి ఆపరేషన్ గంగాలో పాల్గొనే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.