గుడ్డు… వెరీ బ్యాడ్..
-అంగన్‌వాడీ సెంటర్లలో ఇష్టారాజ్యంగా గుడ్ల పంపిణీ
-పట్టించుకోని సూపర్‌వైజర్లు, సీడీపీవోలు
-ప్రతి నెలా లక్షల్లో ముడుపులు
-అందుకే మౌనంగా ఉంటున్నారని ఆరోపణలు
పై ఫొటోలో ఉన్న గుడ్లను చూశారా… అవును అవేంటి అంతగా చిన్నగా ఉన్నాయనుకుంటున్నారు కదా..? నిజమే.. సామాన్య ప్రజలకు, మిగతా వారికి అవి చిన్నగానే కనిపిస్తాయి. కానీ, అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, సీడీపీవో, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు మాత్రం అవి చిన్నగా కనిపించడం లేదు. బాగానే ఉన్నాయని వాళ్లంతా అంటారు.. అనుకుంటారు..
ఎందుకు అలా.. ఎందుకంటే అధికారులకు నిత్యం ముడుపులు ముడుతుంటాయి. కాబట్టి.. కంట్రాక్టర్ ఒక్కో గుడ్డుకి రూపాయి చొప్పున లెక్క కట్టి అధికారుల జేబుల్లోకి.. సారీ… అధికారిణుల పర్సుల్లోకి అందచేస్తుంటారు.. అందుకే వాళ్లు మాట్లడరు.
కంట్రాక్టర్ ఏం చేస్తున్నడు.. పాపం ఇందులో కంట్రాక్టర్ తప్పేం లేదు. ఎవరైనా పని చేసేటప్పుడు ఇంత మిగిలించుకోవాలని చూస్తారు కదా.. ఆయన అలాగే చేస్తున్నడు. మార్కెట్‌లో రిటైల్‌గా కోడిగుడ్లను రూ. 5 నుంచి రూ.6కు, హోల్‌సేల్‌గా రూ. .3.50 నుంచి రూ.4కు విక్రయిస్తున్నారు. చిన్న గుడ్లను హోల్‌సేల్‌గా రూ.2 నుంచి రూ.2.50పైసలకు అమ్ముతున్నారు. కాంట్రాక్టర్లు కోళ్ల ఫారాలనుంచి చిన్న గుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంత మిగిలించుకుంటున్నడు.
మరి అధికారులు ఏం చేస్తున్నారు.. వాస్తవానికి గుడ్ల నాణ్యతపై అంగన్వాడీ కేంద్రాలను ప్రాజెక్టు అధికారులు పరిశీలించాలి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. జిల్లాలో ప్రతి నెలా రెండు విడతలుగా జిల్లాలో మూడు లక్షల అరవై వేల వరకు గుడ్లు అందచేస్తున్నారు. గుడ్డుకు రూపాయి వేసుకున్నా దాదాపు ఏడు లక్షల వరకు అధికారులకు ముడుతున్నయ్ కదా… మరి వాళ్లు మాత్రం ఏం చేస్తరు.. సైలెంట్‌గా ఉంటున్నరు.
అంగన్‌వాడీ టీచర్లు అడగటం లేదా..? వాస్తవానికి కోడిగుడ్డు 50 గ్రాముల కంటే తక్కువగా ఉంటే వాటిని అంగన్‌వాడీ సిబ్బంది తిరస్కరించాలి. కంట్రాక్టర్ సరఫరా చేసే గుడ్లు 30 నుంచి 35 గ్రాములు మాత్రమే ఉంటున్నాయి. చాలా మంది అంగన్‌వాడీ టీచర్లు గుడ్లు తీసుకున్నట్లు లెక్కచూపుతూ కంట్రాక్టర్‌కే ఇస్తున్నారు. ఒక్కో గుడ్డుకు రెండు రూపాయలు కంట్రాక్టర్ అక్కడే చెల్లిస్తుండటంతో వారి పని సులువు అవుతోంది. మరోవైపు ఎక్కడైనా కొందరు టీచర్లు మాట్లాడితే అధికారులే వారిని బెదిరిస్తారు. దీంతో పాపం వాళ్లు కూడా ఏమీ మాట్లాడం లేదు.
మరి ఎవరూ ఫిర్యాదు చేయరా..? ఖచ్చితంగా చేస్తారు. అయినా ఎవరూ పట్టించుకోరు. నిత్యం మామూళ్లు ముడుతున్నయ్ కాబట్టి సూపర్‌వైజర్లు, సీడీపీవోలు, జిల్లా అధికారులు పట్టించుకోరు. ఇక తాము చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుతారు కాబట్టి అంగన్‌వాడీ టీచర్లు కూడా మాట్లడరు. ఫిర్యాదు చేసిన వారు బద్నామ్ అవటం తప్ప ప్రయోజనం లేదు. అందుకే అవినీతి అలా సాగుతోంది..