ఎంతో నేర్చుకున్నాం
- మహిళలను ఆదుకోవడంలో వన్‌స్టాప్ సెంటర్లపై సెమినార్
- స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ ప్రారంభించారు
- వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడే అవకాశం చిక్కింద
- మహిళా సంరక్షణకు మరింత ముందుకు వెళ్తాం
- మంచిర్యాల సఖి సెంటర్ సీఏ శ్రీలత
మంచిర్యాల : అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సదస్సులో తాము ఎంతో నేర్చుకున్నామని మంచిర్యాల సఖి సీఏ శ్రీలత వెల్లడించారు. ఢిల్లీలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రెండు రోజుల పాటు వన్ స్టాప్ సెంటర్ల నిర్వాహకులతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందులో పాల్గోన్న ఆమె నాంది న్యూస్‌తో మాట్లాడారు.
ఈ రెండు రోజుల సెమినార్‌లో మహిళలను ఆదుకోవడంలో వన్ స్టాప్ సెంటర్లు పోషించే పాత్రపై కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్‌ను ప్రారంభించారని వెల్లడించారు. దీని ద్వారా మహిళల మానసిక సామాజిక శ్రేయస్సుపై ప్రత్యేక దృప్టి పెట్టవచ్చన్నారు. వన్‌స్టాప్ కౌన్సెలర్‌ల కోసం అధునాతన శిక్షణా కోర్సు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. వన్ స్టాప్ సెంటర్ల సామర్థ్యం పెంచేందుకు సైతం చర్చా కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. దీని ద్వారా సఖి సెంటర్‌కు వచ్చే మహిళల భద్రత,ఇతర వ్యవహారాలపై అవగాహన కలిగిందన్నారు. మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన సీఏ ల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం కలిగిందన్నారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ప్రసంగంతో మహిళల భద్రతపై తీసుకోవాల్సిన ఎన్నో విషయాలు అవగతమయ్యాని వెల్లడించారు. స్త్రీ మనోరక్ష ప్రాజెక్ట్ కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని ఈ ప్రాజెక్టు మహిళలకు ప్రాణం, గౌరవాన్ని అందించే గొప్ప లక్ష్యమని గుర్తు చేశారని స్పష్టం చేశారు. ఇలా ప్రతి అంశంలో తమకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారని చెప్పారు. సఖి సెంటర్‌కు మహిళలకు సహాయం చేయడంలో కౌన్సెలర్ల నుండి సెక్యూరిటీ గార్డు, సూపర్‌వైజర్ వరకు సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని కేంద్ర మంత్రి చెప్పారని దీనివల్ల ఇక్కడకు వచ్చే మహిళలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు.
ఈ సెమినార్‌లో భాగంగా చాలా చోట్ల మహిళలకు అందిన న్యాయం, ఇతర అంశాలపై ప్రాజెక్టులను ప్రదర్శించారని చెప్పారు. ఇందులో మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఒక కేస్ స్టడీ కూడా ఉందని అది ప్రదర్నించే సమయంలో ఎంతో ఆనందం వేసిందన్నారు. ఈ సందర్భంగా వన్‌స్టాప్ సెంటర్ల సహాయంతో మహిళలు కూడా ఈ వేడుకలో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారని చెప్పారు. లబ్ధిదారులు ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్‌లు జరిగాయని స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల సెమినార్ ద్వారా ఎంతో నేర్చుకున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు ఏ విధంగా సాయం అందిచవచ్చో తెలుస్తుందన్నారు. తరచూ సెమినార్లు నిర్వహించాలని శ్రీలత కోరారు.