పోలీస్ వర్సెస్ టాస్క్‌ఫోర్స్
-కోడి పందాలపై రెండు వర్గాల మధ్య పొరపొచ్చాలు
-దేవులాడ సమీపంలో కోడిపందెం రాయుళ్లను పట్టుకున్నామన్న టాస్క్‌ఫోర్స్
-తమ ప్రాంతంలో కోడి పందాలు లేవని సీఐ వాదన
-ఉన్నతాధికారుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో కోడి పందెం రాయుళ్ల పట్టివేత పోలీసులు వర్సెస్ టాస్క్‌ఫోర్స్ గా మారింది. తమ వద్ద కోడి పందాలు జరగడం లేదని మరి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎలా పట్టుకుంటారని చెన్నూరు సీఐ కేసు పెట్టేందుకు నిరాకరించారు. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది..
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులాడ, బబ్బెరచెల్క గ్రామ శివారు ప్రాంతాల్లో కోడి పందాలు ఆడుతున్నారని 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో నాలుగు కోడి పుంజులు, ఐదు కత్తులు, రూ. 1,51,000, 26 సెల్‌ఫోన్లు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అయితే తమ పరిధిలో ఎలాంటి కోడిపందాలు ఆడటం లేదని, మహారాష్ట్రలో ఆడుతున్న వారు తిరిగి వస్తుండగా వారిని పట్టుకుని కోటపల్లి మండలంలో ఆడుతున్నట్లుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు సృష్టిస్తున్నారని చెన్నూరు రూరల్ సీఐ వాదించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు చేయబోయనని మొండికేశారు. తనకు ఆట ఆడినట్లుగా ఆనవాళ్లు చూయిస్తే కేసు పెడతానని చెప్పడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏం చేయాలో అర్దం కాక అయోమయంలో పడ్డారు. అంత పెద్ద మొత్తంలో కోడి పందాలు జరిగితే ఖచ్చితంగా తమ దృష్టికి వస్తుందని తామే పట్టుకుని కేసులు పెడతాం కదా..? అన్నది ఆయన వాదన.
దీంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. తమ టార్గెట్ నిండటం కోసం ఇలా చేయడం సరికాదని సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినట్లు తెలుస్తోంది. పట్టుకున్న నాలుగు ఐదు గంటల తర్వాత కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎట్టకేలకు రాత్రి కోడిపందాల విషయంలో కేసు నమోదు కావడం గమనార్హం.