భార్యల స్థానంలో భర్తలకు సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ టౌన్ లో మహిళా విజయోత్సవ సభ నిర్వహించారు. సభలో మహిళా కౌన్సిలర్లకు బదులుగా వారి భర్తలకు సన్మానం చేయడంతో సమావేశానికి హాజరైన వారంతా ఒక్కసారిగా నివ్వెర పోయారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో విజయోత్సవ సభ సాక్షిగా మహిళలను అగౌరపరిచేలా వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.భార్యల పదవులపై భర్తలు పెత్తనం చెలాయించడం,దానిని అధికారులు ప్రోత్సహించడంపై విమర్శలు గుప్పుమన్నాయి. నర్సాపూర్ మున్సిపల్ మహిళా కౌన్సిలర్లు సరిత స్థానంలో భర్త అంజా గౌడ్ కు, లలిత స్థానంలో భర్త భిక్షపతి, లక్ష్మికి బదులు భర్త నగేష్ కు సభా వేదికపై సన్మానం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుందని పలువురు దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాలకులు,అధికారులు కళ్ళు తెరిచి రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వారి గౌరవాన్ని కాపాడాలని అప్పుడే మహిళా దినోత్సవానికి సరైన అర్థం లభిస్తుందని మహిళలు అన్నారు.