భగీరథుడి అండగా.. ఆనందం నిండగా…
-చెన్నూరు రైతుల పాదాల కడిగేందుకు తరలిరానున్న గంగమ్మ
-లక్ష ఎకరాలకు నీరందించే ఎత్తిపోతలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
-టెండర్లు పిలుస్తామని బడ్జెట్‌లో హామీ
-మంత్రులు అయినా పట్టించుకోని గత పాలకులు
-విప్ బాల్క సుమన్ చొరవతో మారనున్న వ్యవసాయం రూపురేఖలు
-ఆనందం వ్యక్తం చేస్తున్న కర్షకులు
మంచిర్యాల : తలాపునే గోదారి… మన చేను చెలక ఎడారి.. తెలంగాణ ఉద్యమ సమయంలో పాడుకున్న పాట… మిగతా ప్రాంతాల మాటేమో కానీ… చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇది అతికినట్లు సరిపోతుంది.. నియోజకవర్గానికి రెండు వైపులా గోదారమ్మ, ప్రాణహిత తల్లి గలగలా ప్రవహిస్తాయి. కానీ చుక్కనీరు కూడా ఉపయోగపడని దుస్థితి. పొలాలన్నీ బీళ్లే.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారనుంది. రైతుల కండ్లలో ఆనందం నిండనుంది.
చెన్నూరు నియోజకవర్గంలో చాలా మేరకు పడావు పడ్డవే. సాగునీటి సౌకర్యం లేక వర్షాధార పంటలుగా పత్తి, కంది సాగు చేసుకుంటున్నారు ఇక్కడి రైతులు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా లిప్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఒక్క చెన్నూరు నియోజకవర్గానికే లక్షకు పై చిలుకు ఎకరాల్లో పంటలకు నీరందనుంది. దీంతో చెన్నూరు నియోజకవర్గం రైతుల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కాళేశ్వరం జలాలతో ఆ ప్రాంత ఆయక ట్టుకు రెండు పంటలకు సాగునీరు అందనున్నది.
మూడు లిఫ్టులు… 1.31 లక్షల ఎకరాలు..
మూడు లిఫ్టులతో చేపట్టే ఎత్తిపోతల ద్వారా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 1.31 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా సర్వే చేశారు. మొదటి లిఫ్ట్‌ను సుందిళ్ల బ్యారేజీ వద్ద నిర్మిస్తారు. ఈ లిఫ్టు ద్వారా 65,895 ఎకరాలకు నీరు అం దిస్తారు. అన్నారం బ్యారేజీ వద్ద రెండో లిఫ్ట్ ద్వారా 38,175 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద మూడో లిఫ్టు ద్వారా 27,187 ఎకరాలకు నీరందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఐదు మండలాల్లోని 102 గ్రామ పంచాయతీల్లోని 367 చెరువులను గొలుసు కట్టుగా నింపనున్నారు. కాళేశ్వరం నీటితో 1.31 లక్షల ఆయకట్టుకు సాగు నీరందించడం లక్ష్యంగా పనులు చేస్తున్నారు. లిఫ్టులు నిరంతరం పనిచేసే విధంగా చూస్తుండటంతో చెరువుల్లో ఏడాదంతా నీరు నిల్వ ఉం డనుంది. దీంతో ఇన్నాళ్లు ఒకే పంటతో సరిపెట్టుకున్న రైతులు రెండు పంటలు పండించుకునే వీలు కలుగుతుంది.
పాలకులు పట్టించుకోలేదు..
గత పాలకులు కనీసం ఈ నియోజకవర్గం గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో రైతులు కేవలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన బోడ జనార్దన్, గడ్డం వినోద్ మంత్రులుగా సైతం చేశారు. కానీ రైతుల గురించి ఏనాడు పట్టించుకోలేదు. పుష్కలమైన నీటి వనరులు ఉన్నా వాటి వైపు దృష్టి సారించలేదు. మిగతా వారి పరిస్థితి కూడా అంతే. ఏ ఒక్కరూ కూడా నియోజకవర్గ అభివృద్ది గురించి మాట్లాడిన పాపాన పోలేదు.
బాల్క చొరవతో మారనున్న రూపురేఖలు…
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాలో ప్రాధాన్యత అంశాలను తీసుకుని మరీ ఆయన అభివృద్ధి వైపు దూసుకుపోతున్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న సాగు భూములపై సర్వే చేయించిన బాల్క సుమన్ వాటికి నీటి సౌకర్యంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదన సిద్ధం చేయించారు. ఇప్పుడు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.