మహాసభలను విజయవంతం చేద్దాం..

సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు, సింగరేణి వ్యాప్తంగా కార్మిక సమస్యల పై కార్యాచరణ ప్రకటించేందుకు నిర్వహించనున్న బీఎంఎస్ 27వ మహాసభలను విజయవంతం చేయాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. గురువారం గోదావరిఖని 2 ఇంక్లైన్లో గేట్ మీటింగ్లో పాల్గోని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో జరుగుతున్న కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ, దేశంలో జరుగుతున్న కమర్షియల్ మైనింగ్ విధానంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. సింగరేణిలో రాజకీయ జోక్యం, అవినీతిపై పోరాటం చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సంస్థలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాలపై సైతం చర్చిస్తామన్నారు. 11వ వేజ్ బోర్డు, అలవెన్సుల మీద ఆదాయపన్ను కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో రియంబర్స్ మెంట్ పై తీర్మానం చేస్తామన్నారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్నకాంట్రాక్ట్ కార్మికులకు సామాజిక భద్రత, హైపవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పదవి విరమణ పొందిన కార్మికులకు పెన్షన్ వైద్య సదుపాయం మెరుగు పరిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. సుమారు 1000 మంది ప్రతినిధులతో మహాసభను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సాయివేణి సతీష్, బూర్ల లక్ష్మీనారాయణ, సిరిపురం నరసయ్య, పోతరవేణి విజయ్ కుమార్, బోడకుంట రాజేశం, ఎల్లావుల కోటయ్య, ఆరెల్లి వెంకటరాజం, తాట్ల లక్ష్మయ్య, అంబటి మల్లికార్జున్, సంగాని సాంబయ్య,ఆకుల హరిణ్, ఆరెల్లి శ్రీకాంత్,యన్. బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.