యోగి గెలుపు వెనక తెలుగు వ్యక్తి
ఇప్పుడంతా వ్యూహకర్తల యుగం నడుస్తోంది. పార్టీలు తమ గెలుపు కోసం వ్యూహకర్తలను రంగంలోకి దించుతున్నాయి. తమ గెలుపు కోసం ఎంత ఖర్చైనా చేయడానికి వెనకాడటం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్‌ను దించారు. కాంగ్రెస్ పార్టీ మరో వ్యూహకర్తను రంగంలోకి దించింది. అయితే యూపీలో యోగీ గెలుపు వెనక మన తెలుగు వ్యక్తి ఉన్నాడు.
తెలంగాణ టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుంచే పని చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు, ఎన్నికల్లో గెలిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఇలా అన్ని ఆయన మీదుగానే నడుస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం సునీల్ కానుగోలు అనే వ్యూహకర్తను రంగంలోకి దించింది. ఆయన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీంలో కీలకంగా పనిచేశారు. ఆయన తమిళనాడు అన్నాడీఎంకేకు పనిచేశారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రంగంలోకి దిగనున్నారు. గురు శిష్యులు ఇద్దరు రంగంలోకి దిగడం ఆసక్తిగా మారింది.
యోగీ ఆదిత్యనాథ్ విషయంలో సత్యకుమార్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో తన వ్యూహాలకు పదును పెట్టి ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఉత్తరప్రదేశ్ కు సంబంధించి వ్యూహాలు రచించి వాటిని అమలు చేసిన సత్యకుమార్ భారతీయ జనతా పార్టీ గెలుపు బావుటా ఎగరవేసేలా చేశారు. మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ అణువణువు సర్వే చేయించారు. నియోజకవర్గాల వారీగా గెలుపు ఓటములను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగారు. ఎక్కడ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి.. గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇలా అన్ని రకాలుగా వెనకుండా నడిపించారు. చాలా చోట్ల ఎన్నికల సభల్లో యోగీ వెంటే ఉన్నారు. ఇక ఆయన తెలుగు బిడ్డ కావడం గమనార్హం. తీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు మోస్తున్న ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. ఇవాళ అంతా ప్రశాంత్ కిశోర్ జపం చేస్తుంటే బీజేపీ మాత్రం ఆయన్ను కాదని మన తెలుగింటి తేజానికి పెద్ద పీట వేసి గెలుపు బాటలో పయనించింది.