అప్పుడు చెల్లని రూపాయి.. ఇప్పుడు చెల్లుతుందా..?
వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది మా యూనియన్‌లో లేదు… బైలాస్ మార్చితే తప్ప ఆ పదవికి అసలు విలువే లేదు. కెంగర్ల మల్లయ్య కేవలం టీబీజీకేఎస్ యూనియన్‌లో సభ్యుడు మాత్రమే…
ఇది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత కెంగర్ల మల్లయ్య గురించి గతంలో ఆ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పిన ముచ్చట. కానీ మళ్లీ ఇప్పుడు అదే మల్లయ్యను అదే పదవి కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది…? ఆయనను తిరిగి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ఆ యూనియన్ ఏ ముహూర్తాన ప్రారంభం అయ్యిందో కానీ.. మొదటి నుంచి గ్రూపుల గొడవతో సతమతం అవుతోంది. పెద్ద నేతలు బయట పడకుండా యూనియన్‌లో తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఏరియా వారీగా ద్వితీయ శ్రేణి నాయకత్వం గ్రూపులుగా విడిపోయి టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు. అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి. బయటకు కనిపించకపోయినా నివురుగప్పిలా గ్రూపులు కొనసాగుతున్నాయి. మొదటి నుంచి మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. కార్యాలయాలకు తాళాలు వేసుకోవడం, చివరకు భౌతికదాడులకు సైతం దిగడం వరకు వెళ్లింది. అధిష్టానం వెంకట్రావ్ ను యూనియన్‌లోకి తీసుకుంది.
ఆయన వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఏం మార్పు కనిపించలేదు. దీంతో టీబీజీకేఎస్ కార్యకర్తల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. అప్పటి వరకు రెండు గ్రూపులుగా కొనసాగిన యూనియన్ మూడో గ్రూపునకు దారి తీసింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. గ్రూపుల మధ్యనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు వెళ్లింది. అప్పుడు ఆ యూనియన్ ఓడిపోయే పరిస్థితి. డబ్బు, మద్యం పుణ్యమా అని ఆ యూనియన్ గట్టెక్కింది. ప్రజాప్రతినిధులు ముఖ్యంగా విప్ బాల్క సుమన్ శ్రీరాంపూర్ డివిజన్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. లేకపోతే సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు వచ్చేదే కాదు.
ఇలా వార్ జరుగుతున్న సమయంలో మిర్యాల రాజిరెడ్డి, వెంకట్రావ్ కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసలు కెంగర్ల మల్లయ్య తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడని అసలు యూనియన్‌లో ఆ పదవే లేదంటే స్పష్టం చేశారు. ఆ పదవికి సంబంధించి బైలాస్ మార్చాల్సి ఉంటుందని ఇప్పట్లో అది సాధ్యం కాదని వెల్లడించారు. దీంతో కెంగర్ల తనకు జరిగిన అవమానం భరించలేక యూనియన్ వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆయన బీఎంఎస్‌లో చేరారు. అందులో కీలకంగా మారి యూనియన్ బలోపేతంపై దృష్టి పెట్టారు. దీంతో అధిష్టానం ఆయనను వెనక్కి తీసుకువచ్చే పనిలో పడింది. అధినేత ఆయనను తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై పెట్టింది. ఆయన కెంగర్లను బీఎంఎస్‌కు రాజీనామా చేయించి తిరిగి టీబీజీకేఎస్‌లోకి తీసుకువచ్చారు.
తమ పదవులకు ఎక్కడ ముప్పు వస్తుందోనని గమనించిన అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హడావిడిగా కల్వకుంట్ల కవితను కలిశారు. తర్వాత శ్రీరాంపూర్‌లో కొందరు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మళ్లీ తమ పదవులను రెన్యూవల్ చేసుకున్నారు. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కల్వకుంట్ల కవితను మళ్లీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ప్రకటించేశారు. కెంగర్ల మల్లయ్య తిరిగి యూనియన్‌లోకి వచ్చినా ఏం చేయలేని దుస్థితి. దాదాపు పది నెలల పాటు ఆయన యూనియన్‌లో సైలెంట్ మోడ్‌లో ఉండిపోయారు.
తాజాగా రెండు రోజుల కిందట కెంగర్ల మల్లయ్యను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా ఆమె కార్యాలయం నుంచి ప్రెస్‌నోట్ సైతం విడుదల అయ్యింది. అయితే, ఎక్కడా బైలాస్ మార్చకుండానే ఈ నియామకం జరగడం గమనార్హం. రెండు, మూడు సంవత్సరాలు కెంగర్లను పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ సింగరేణి వ్యాప్తంగా సాగుతోంది. ఆయన యూనియన్ వీడి బీఎంఎస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. అది బలోపేతం కాకుండా ప్రధాన లక్ష్యం. కాగా, యూనియన్‌లో ఎదుగుతున్న ఏకైక బీసీ నేత ఆయన. ఆయనను దూరం పెడితే టీబీజీకేఎస్ కు తీరని నష్టం కలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించే కెంగర్లను యూనియన్‌లోకి తీసుకున్నారు.
ఇలా చాలా రకాలైన పరిణామాల నేపథ్యంలో కెంగర్ల మల్లయ్యను తెలంగాణ బొగ్గు గనిలోకి తీసుకోవడం, ఆయనకు ఆరో వేలు లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టడం జరిగాయి. యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి అన్నట్లుగా అప్పుడు చెల్లని రూపాయి ఇప్పుడు ఎలా చెల్లుతుందో చూడాలి మరి..