సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు
-ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటాం
-అసెంబ్లీ లో ప్రకటించిన సీఎం కేసీఆర్
-ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-ఆనందోత్సాహాలలో సెర్ప్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు
సెర్ప్, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పేదరిక నిర్మూలనలో, డ్వాక్రా సంఘాలకు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న సెర్ప్ లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పారు. 2022-23 ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీ లో మంగళవారం ప్రసంగించిన ముఖ్యమంత్రి పలు వరాలు కురిపించారు. ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం తెలిపారు. కొంత కాలంగా ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామన్నారు. అయితే భేషజాలకు పోయి ఆందోళనలు, ధర్నాలు చేయవద్దని, అలా చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. దీంతో 7,305 ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి వారి ఉపాధి వారికి లభించినట్లు అయింది.
తాను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు వరాలు కురిపించిన ముఖ్యమంత్రికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.