ఫోన్‌పే, గూగుల్ పేకు పోటీగా కొత్త పేమెంట్ యాప్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉండటంతో ఈ ప్రక్రియ మరింత సులువుగా మారింది. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాట్సప్ పే ద్వారా కూడా డిజిటల్ చెల్లింపులు చోటు చేసుకుంటున్నాయి. త్వరలోనే ఈ విభాగంలోకి టాటా గ్రూప్ సంస్థ కూడా చేరనుంది. ఆ సంస్థ అడుగుపెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాటికి గట్టి పోటీ అవుతుందని పలువురు భావిస్తున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించి పనులు చేసేందుకు టాటా గ్రూపు సంస్థ రంగంలోకి దిగింది. యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి క్లియరెన్స్ ఇచ్చే అనుమతి కోరింది. వచ్చే నెలలో ఈ సర్వీసును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. టాటా గ్రూప్స్ డిజిటల్ కామర్స్ వింగ్, టాటా డిజిటల్ కలిసి ICICI బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఈ కంపెనీ తన డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం శక్తివంతం చేయడానికి మరొక ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ భాగస్వామితో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే నెల టాటా గ్రూప్ తన సూపర్ యాప్‌ను ‘టాటా న్యూ’ పేరుతో విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. కొత్త ప్రణాళికలతో ఖరారు చేసిన సమయంలోనే దీనిని అభివృద్ధి చేయాలని సంస్థ యొక్క వ్యూహం. ‘టాటా న్యూ’ UPI పేమెంట్ యాప్ వినియోగదారులకు బిగ్ బాస్కెట్, క్రోమా, టాటా క్లిక్ వంటి టాటా డిజిటల్ యాప్‌లతో పాటు దాని ఫ్లైట్ బుకింగ్ సర్వీస్‌ను ఒకే యాప్‌లో సులభంగా యాక్సెస్ చేయడానికి వీలును కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఏప్రిల్ 7న టాటా డిజిటల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.