యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య

కలుషితమైన నీటిని సరఫరా చేసి కార్మికుల అనారోగ్యానికి కారణమైన ఆర్జీ 1 యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ 1 జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని రెండేళ్లుగా బీఎంఎస్ ఆందోళనలు చేస్తున్నా కనీసం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఆర్జీ 1 యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన డ్రైనేజ్ వాటర్ కలిసి మురుగునీరును స్వచ్ఛమైన తాగునీరుగా సరఫరా చేస్తూ కార్మిక కుటుంబాల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. రూ. 20 కోట్లు మంచి నీటి కోసం విడుదల చేస్తున్నామని ప్రకటించి తిరిగి వాపసు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే మెడికల్ కాలేజ్ కోసం కార్మికుల శ్రమతో సంపాదించిన 500 కోట్ల రూపాయలు ధారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కనీసం మంచినీళ్లు అందించ లేకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా యజమాన్యం మంచినీటి శుద్ధికోసం యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టాలని, కార్మికులందరికీ మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యతిపతి సారంగ పాణి,ఆకుల హరిన్,పెండం సత్యనారాయణ ,సైవేనసతీష్, వడ్డేపల్లి కుమార్, మంచినీల స్వామి, పల్లె శ్రీను, యెల్లావుల కోటయ్య , నీలం శ్రీను,చాట్ల లక్ష్మయ్య,పోరండ్ల వెంకటేష్, మేడా రామ్మూర్తి , బోడకుంట రాజేశం,గాజుల వేంకరస్వామి,యాదగిరి తదితరులు పాల్గొన్నారు.