నాకూ.. రేవంత్ రెడ్డి మ‌ధ్య‌నే పంచాయ‌తీ

-రేవంత్ రెడ్డి వివ‌క్ష చూపుతున్నారు
-కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా
-నా ప్ర‌తిష్ట దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు
-సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నారు
-ఆయ‌న‌కు రాజ‌కీయంగా ఝ‌ల‌క్ ఇస్తా
-సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపట్ల వివక్ష చూపిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం విలేక‌రుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలందరినీ కలుపుకుపోయే తత్వం రేవంత్ కు లేదన్నారు. ఆయన ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనను కించపరిచే విధంగా పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నానంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారని, ఇలాంటి ప్రచారాలను ఖండించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వంగా కక్షగట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తనకు కాంగ్రెస్, సోనియా, రాహుల్ కుటుంబంతో ఇబ్బంది లేదన్నారు. తనకు రేవంత్ కు మధ్యనే పంచాయితీ ఉందన్నారు. ఇటీవల రేవంత్ మెదక్ వెళ్తున్న సందర్భంలో తనకు ఫోన్ చేసి వెళ్తున్నా అని సమాచారం మాత్రమే ఇచ్చారని..రమ్మని పిలవలేదన్నారు. దామోదర రాజనర్సింహకి ఫోన్ చేసి మెదక్ కి రమ్మని రేవంత్ పిలిచారని..దాంతో తాను మనస్థాపానికి గురైయ్యానని చెప్పారు.

రాజకీయంగా కేసీఆర్ తో ఎలాంటి గొడవలు లేవన్నారు జగ్గారెడ్డి. తాను పీసీసీ కావాలని కోరుకున్నానని చెప్పారు. తాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానని..అందుకే కొందరు సీనియర్లు తనతో మాట్లాడేందుకు భయపడుతున్నారన్నారు. తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని..తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. రేవంత్ కు రాజకీయ ఝలక్ ఎలా ఇవ్వాలో తనకు బాగా తెలుసన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను బుజ్జగించినట్లు ప్రచారం చేశారని..అందంతా పచ్చి బూటకమన్నారు. సీఎల్పీ మీటింగ్ తర్వాత ఒంటరిగా గదిలోకి పిలిపించుకుని సీఎం సీరియస్ గా ఉన్నారని..ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని చెప్పారని తెలిపారు. అసలు సీఎంకు సీరియస్ గా ఉంటే అసెంబ్లీ నడుస్తదా అని ప్రశ్నించారు.చంద్రబాబు రేవంత్ కు సరైన స్థాయిలో రాజకీయ శిక్షణ ఇవ్వలేదన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా?.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా? అని నిలదీశారు. ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుందని, సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like