టీకా… చకచక..
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు దశల్లో టీకా ప్రక్రియ వేగవంతం చేశారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లు, రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్కు టీకా అందించారు. మూడో దశలో 80 ఏళ్లపై బడిన వారికి, నాలుగో దశ లో 18–నుంచి 44 ఏళ్ల వారికి, ఐదో దశలో 45-59 ఏళ్ల వారికి ఆరో దశలో 15-18 ఏళ్ల వారికి దశల వారీగా టీకా ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో మొదటి, రెండో దశ టీకాలను పూర్తి చేసి బూస్టర్ డోస్ సైతం అందించారు.
కొనసాగుతున్న ఏడో విడత..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరు దశలుగా కోవిడ్ టీకాలు అందించింది. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏడో విడత టీకా కార్యక్రమం కొనసాగుతోంది. ఏడో విడతలో 12 ఏళ్ల నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులకు టీకా లు అందిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా కార్బివాక్స్ టీకాను ఇస్తున్నారు. మంచిర్యాల జిల్లా లో 37 వేల మంది 12-14 ఏళ్ల లోపు వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ టీకాలు అందుబాటులో ఉంచారు. జిల్లాలోని అన్ని పీహెచ్ సీలతో పాటు యూపీహెచ్సీల్లో టీకాలు వేస్తున్నారు.
మందమర్రిలో చురుకుగా..
మందమర్రి మండలంలో టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుకుగా సాగుతోంది. మెడికల్ అధికారి సీ.మానస, ఏఎన్ఎంలు కవిత, సంధ్యారాణి, ఆశా వర్కర్ శంకరమ్మ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో ఈ టీకా అందిస్తున్నారు. గురువారం మందమర్రిలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ టీకా కార్యక్రమం నిర్వహించారు. అనుకున్న సమయంలోపు లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు చెబుతున్నారు.