సమ్మె ద్వారా కేంద్ర విధానాలు ఎండగడదాం
కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతల పిలుపు
మంచిర్యాల : రెండు రోజుల సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎండగడదామని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు పిలుపునిచ్చారు. ఖైరిగుడ ఓపెన్‌కాస్టులో కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు సరికావని దుయ్యబట్టారు. బ్లాకులను ప్రైవేటుపరం చేయకుండా కమర్షియల్ మైనింగ్ విధానం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సింగరేణి ప్రాంతానికి చెందిన నాలుగు బొగ్గు గనులను వేలం వేసి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పజెప్పాలని కోరారు. బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మిక వర్గం కట్టు బానిసలుగా తయారయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని ఈ నెల 28 29న నిర్వహించే సమ్మె విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ పతెం రాజబాబు, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సోమారపు తిరుపతి, సెంట్రల్ నాయకులు ఎం.శివారెడ్డి, ఎం.సమ్మయ్య, చిప్పనర్సయ్య, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, కైరిగుడ ఇంచార్జి. వెంకటేష్, సీఐటీయూ ఉపాధ్యక్షుడు అండాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.