పాపం.. మంత్రి సభకే మంది లేరు..
కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ఎట్ట పరిస్థితుల్లో వరిధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే కేంద్రంపై ఆందోళన చేస్తామన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలను సమాయత్తం చేసేలా కార్యచరణ ప్రకటించారు. దీంతో ఆయా జిల్లాల్లో నేతలు గురువారం సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు.
దానిలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హల్‌లో టీఆర్ఎస్ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, నేతలు పట్టించుకోలేదో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సీరియస్‌గా చెప్పలేదో కానీ… సమావేశానికి జనం పెద్దగా హాజరు కాలేదు. కొందరు నేతలు, మరికొందరు కార్యకర్తలు మినహా పెద్దగా స్పందన కనిపించలేదు. వేసిన కుర్చీల్లో సగం కూడా నిండలేదు. చాలా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులపై అసహనం వ్యక్తం చేశారు.
ఇందుకు భిన్నంగా మంచిర్యాల జిల్లాలో జరిగిన సన్నాహాక సమావేశాలు నేతలు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయాయి. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిర్వహించిన సమావేశాలు జనంతో నిండిపోయాయి. మూడు నియోజకవర్గాల్లోనూ ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసిన ప్రతి సభకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.