సింగరేణి ప్రైవేటీకరణపై ఆ ఇద్దరూ దోషులే..
సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ దోషులేనని INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర” ఐదవ రోజు చేరుకుంది. రామగుండం ఏరియా OCP-3గని లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బ్యాంకులు, రైల్వేలు, బొగ్గు గనులు, అనేక సంస్థలను జాతీయం చేసి ప్రభుత్వ రంగ సంస్థలుగా నెలకొల్పిందన్నారు. అలా కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వత్తాసు పలుకుతున్నదన్నారు. 2017 పార్లమెంట్ సమావేశాల్లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యతిరేకిస్తే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆ బిల్లుకు మద్దతు పలికారని ప్రశ్నించారు. అప్పుడు ప్రైవేటీకరణకు పూర్తి మద్దతు పలికి ఇప్పుడు ఏమి తెలియని అమాయకుల్లా ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటూ దొంగ ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు సింగరేణి కార్మిక వర్గాన్ని అటు రాష్ట్ర ప్రజానీకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. అక్బర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.నరసింహ రెడ్డి, పీ.ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, మహంకాళి స్వామి,సదానందం, శంకర్. పీ.రాజేందర్, మార్కండేయ, గుడేటి రాజేష్, గడ్డం కృష్ణ పాల్గొన్నారు.