భార్యను కొట్టిన భర్త.. 75 రోజుల జైలుశిక్ష
భార్యను విచక్షణా రహితంగా కొట్టిన భర్తకు న్యాయస్థానం 75రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సిఖ్ విలేజ్‌లో నివసించే ఎల్లోల ప్రశాంత్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్యతో గొడవపడి వేధింపులకు గురిచేసేవాడు. ఒక్కో సమయంలో మరింత రెచ్చిపోయి కొడుతూ చిత్రహింసలకు గురిచేసేవాడు. గురువారం భార్యను రోడ్డుపైకి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడంతో పాటు స్థానికులను ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో అక్కడివారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిందితుడిని శుక్రవారం 13వ ప్రత్యేక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రశాంత్‌కు 75 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.