పెళ్లి బస్సు బోల్తా… ఎనిమిది మంది మృతి
ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో మహిళ, చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనాస్థలిలో ఏడుగురి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ప్రమాదంలో పెళ్లి కుమారుడితో పాటు మరో 43 మందికి గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపువద్ద శనివారం రాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మృతులు మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40), మలిశెట్టి గణేశ్ (40), జె.యశశ్విని(8) డ్రైవర్ నబీ రసూల్, క్లీనర్ మృతి చెందినట్లు గుర్తించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు క్షతగాత్రుల తరలించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వేణు కుటుంబం ధర్మవరం నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు 63 మందితో కలిసి ఓ ప్రైవేటు బస్సులో బయలుదేరింది. చిత్తూరు జిల్లా పీలేరులో రాత్రి 8 గంటల సమయంలో ఓ దాబా వద్ద అందరూ భోజనాలు చేశారు. ఆపై 9 కిలోమీటర్లు ప్రయాణించి భాకరాపేట ఘాట్‌లో వస్తుండగా దొనకోటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపులో ప్రమాదం చోటుచేసుకుంది.
డ్రైవరు అతి వేగంగా నడపటంతో మలుపువద్ద అదుపు తప్పి కుడివైపున సుమారు 100 అడుగుల లోయలోకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్షతగాత్రుల రోదనలు, మృత దేహాలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల్లో 10 మందికి పైగా చిన్నారులు ఉన్నారు.తిరుపతి రుయాలో క్షతగాత్రులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరామర్శించారు.
చిమ్మచీకటిగా ఉండటం, ఘాట్ రోడ్డు కావడంతో ప్రమాదం జరిగిన విషయం రాత్రి 10.30 గంటల వరకు వెలుగు చూడలేదు. క్షతగాత్రుల హాహాకారాలతో అటుగా వెళ్లే వాహనచోదకులు ఆగి లోయలోకి దిగి చూశారు. అక్కడ బస్సు పడి ఉండటం, క్షతగాత్రులు చెల్లాచెదురై రోదిస్తుండటాన్ని గమనించి హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ మార్గంలో వెళ్లే వాహనచోదకులు, పోలీసులు అప్రమత్తమై.. లోయలో పడిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఘటనాస్థలానికి చేరుకొని, సహాయక చర్యల్లో పాల్గొన్నారు.