దొంగతనాలు చే్స్తున్న కానిస్టేబుల్

చేసిన అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు దిగాడో కానిస్టేబుల్. తాను పనిచేస్తున్న జిల్లాలో దొంగతనాలు చేస్తే అనుమానం వస్తుందని వేరే జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతూ దొరికిపోయాడు.. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా షాపులో.. యజమాని భార్య మెడలో గొలుసు తెంచుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు సింగిడి సత్యనారాయణ అనే కానిస్టేబుల్. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి రూ. 1లక్షా 20వేలు విలువైన గొలుసు, బైక్, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్‌ను పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ దొంగతనంలో అతడికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గొలుసు దొంగతనం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి సత్యనారాయణ చోరీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలో దొంగతనాలు చేస్తే అనుమానం వస్తుందని పక్క జిల్లా కృష్ణాలో దొంగతనాలు మొదలుపెట్టాడు.