ప్రాణ‌హిత ప్రాణం తీసిండు

కేసీఆర్ పై ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆగ్ర‌హం

కాగ‌జ్ న‌గ‌ర్ : ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రాణ‌హిత ప్రాజెక్టు ప్రాణం తీసిండ‌ని దుబ్బాక‌ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ప్రాణ‌హితలో సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గ నీటి వాట కోసం బీజేపీ నేత హ‌రీష్‌రావు పాద‌యాత్ర ప్రారంభించారు. పాద‌యాత్ర బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డితో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ కేసీఆర్‌కు అంబేద్క‌ర్ అంటే గౌర‌వం లేదు.. ఆయ‌న రాసిన రాజ్యాంగం మీద గౌర‌వం లేదు. అంబేద్క‌ర్ విగ్ర‌హాల మీద గౌర‌వం లేదని దుయ్య‌బ‌ట్టారు. అంబేద్క‌ర్ వ‌ర్థంతికి, జ‌యంతికి గానీ ఆయ‌న ఫొటోకు క‌నీసం దండ వేసిన చ‌రిత్ర కూడా కేసీఆర్‌కు లేద‌న్నారు. ప్రాణ‌హిత చేవెళ్ల ప‌థ‌కం పూర్తి పేరు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టు అని ఆయ‌న పేరు పెట్టినందుకే కేసీఆర్‌కు న‌చ్చ‌డం లేద‌ని తెలిపారు. ద‌ళిత అభ్యున్న‌తి కూడా చంద్ర‌శేఖ‌ర్ రావుకు న‌చ్చ‌ద‌ని అన్నారు.

కేసీఆర్ పొద్దుతిరుగుడు పువ్వులెక్క‌…
ముఖ్య‌మంత్రి కేసీఆర్ పొద్దుతిరుగుడు పువ్వు లెక్క అని ర‌ఘునంద‌న్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పొద్దున ఒకటి మాట్లాడుతాడు పగటికి ఒకటి మాట్లాడుతాడు.. సాయంత్రం ఒకటి మాట్లాడుతాడు పొద్దు తిరుగుడు పువ్వులెక్క తిరుగుతాడని దుయ్య‌బ‌ట్టారు. తలాపున ప్రాణహిత ఉన్నా సిర్పూర్ నియోజకవ‌ర్గానికి ఒక చుక్కనీరు అందకుండా పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి ఆదిలాబాదు జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల‌కు తీరని అన్యాయం జరిగింద‌న్నారు. 2018 నవంబర్ ఎన్నికల సంద‌ర్భంగా కాగజ్‌నగర్ వచ్చిన కేసీఆర్‌ కాళేశ్వరానికి నీళ్లు పోతున్నాయి.. మీరు బాధ‌ప‌డ‌కండి.. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి కట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి సారు మరిచిపోయాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌..
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత నదిలో సిర్పూర్ నియోజకవర్గ నీటివాటా పై బీజేపీ నేత ఆధ్వర్యంలో ప్రాణహిత జలసాధన పేరుతో పాల్వాయి హరీష్ రావు పాదయాత్ర ప్రారంభించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ఈస్గాం వేద మందిరం నుండి పూజ కార్యక్రమం అనంతరం ఈ యాత్రను ప్రారంభం అయ్యింది. దీనికి పెద్ద ఎత్తున రైతులు, బీజేపీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. దాదాపు ఆరు రోజుల పాటు ఈ యాత్ర సాగ‌నుంది. ప్ర‌తి రోజు ఈ యాత్ర‌కు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు హాజ‌రుకానున్నారు. ప్రాణహిత నది నీటివాటతో ఇక్కడ నిర్మించాల్సిన ప్రాజెక్ట్ కాళేశ్వరం తరలించడంతో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయన్ని ప్రజలకు వివరించేందుకు ఈ పాద‌యాత్ర చేప‌ట్టిన‌ట్లు బీజేపీ నేత పాల్వాయి హ‌రీష్‌బాబు వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like