ఆలయంలో అపచారం..
ఏకంగా దేవాలయం క్యాంటీన్‌లో మాంసాహారం వండటం విమర్శలకు దారి తీస్తోంది. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి నుంచే అల్పాహారం, అన్నదానానికి భోజనం సరఫరా అవుతాయి. అదే క్యాంటీన్‌లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీసింది. ఓ వ్యక్తి వేలంపాటలో క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నాడు. అతడి దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త, వైసీపీ నేత షరీఫ్..ఆలయ క్యాంటీన్‌లో మాంసాహారం వండి బయటకి సరఫరా చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం క్యాంటీన్ ముందు రిక్షాపై అన్నం, కూర పాత్రలతో పాటు మాంసం కూర కూడా కనిపించడంతో గమనించిన భక్తులు ఫోటోలు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వాళ్లు నోరు మెదపడం లేదు.