కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మంచిర్యాల : కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ పాఠశాలలో మన ఊరు – మన బడి కింద రూ. 17 లక్షలతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన చేయనున్నట్లు చెప్పారు. 19.84 లక్షల మంది నిరుపేద పిల్లలకు లబ్ధి చేకూర్చాలనే గొప్ప సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని వెల్లడించారు. ఇందుకు కోసం రూ. 7289 కోట్ల నిధులను ప్రభుత్వం సమకూర్చనుందని చెప్పారు. మన ఊరు మన బడి ద్వారా అద్భుత మానవ వనరుల సంపద భవిష్యత్ తెలంగాణకు అందించడానికి దోహదపడుతుందని తెలిపారు. దిగువ, మధ్యతరగతి, పేద కుటుంబాలలో ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని బాల్క సుమన్ వెల్లడించారు.
ప్రధానంగా నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్స్, విద్యుత్, త్రాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, కాంపౌండ్ వాల్, వంటగది, కొత్త క్లాస్ రూమ్ ల ఏర్పాటు, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుచేయాలని ఈ పథకం ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎంట్రన్స్ ఆర్చ్,స్కూల్ కి వెళ్లే రోడ్లు, పాఠశాలలో ఆహ్లాదకరంగా మొక్కల పెంపకం, ఫ్లడ్ లైట్స్, ఆటస్థలం, క్రీడా సామాగ్రి, లైబ్రరీ వంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలో కల్పించే మౌలిక వసతుల కల్పనలో ప్రజలు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాలన్నారు. దాతల సహకారంతో పాటు ఎన్జీవో, యూత్ క్లబ్స్, వివిధ సంఘాలు, అసోసియేషన్లు, పూర్వ విద్యార్థులు ఆర్థికంగా స్థిరపడిన వారి సహకారం తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు వివిధ రకాల సహకారంతో వచ్చిన నిధులతో విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించే అవకాశం ఉందని బాల్క సుమన్ వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని వసతులు ఉన్న ప్పుడే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించగలుగుతామని స్పష్టం చేశారు.