సమీక్షించండి.. చర్యలు తీసుకోండి..
ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
ప్రభుత్వ తీరు విషయంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళ్ సైకి ఫిర్యాదు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మూసీ కాలుష్యంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. గవర్నర్ కు 11 అంశాలపై ఫిర్యాదులు చేశారు. తెలంగాణలో పెరిగిపోతున్న నిరుద్యోగం, 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, తదితర అంశాలపై గవర్నర్‌కు టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేసారు. వీటిపై గవర్నర్ సమీక్ష జరపాలని కోరారు. వరి పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఈ సందర్భంగా టీపీసీసీ నేతలు పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, మాజీమంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ ఇతర ముఖ్య నాయకులందరూ కలసి రాజ్ భవన్ కు వెళ్లారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ గా 40శాతం మంది పంట అమ్ముకున్నారని గవర్నర్ కు చెప్పారు. ముందు పంట అమ్ముకున్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. 111జీవోపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఉండి.. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తోందన్నారు. 111జీవోపై రివ్యూ జరపడంతో పాటు.. డ్రగ్స్, శాంతిభద్రతలపై సమీక్ష చేయాలని గవర్నర్ ను కోరారు కాంగ్రెస్ నేతలు.