మరోసారి చార్జీల పెంపు
ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరో షాకిచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా రిజర్వేషన్ ఛార్జీలు పెంచింది. దూరాన్ని బట్టి రిజర్వేషన్ ఛార్జీలను రూ.20 నుంచి రూ.30 వరకు పెంచింది. అయితే ఈ పెంపునకు సంబంధించి ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల రౌండప్, టోల్ సెస్, టికెట్ ఛార్జీల సవరణ, ప్యాసింజర్ సెస్ పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు టికెట్ల ధరలను భారీగా పెంచిన ఆర్టీసీ యాజమాన్యం తాజాగా రిజర్వేషన్ ఛార్జీల పేరుతో మరోసారి ప్రయాణీకులపై భారం మోపింది.
రౌండింగ్ ఫిగర్ పేరుతో పల్లె వెలుగు బస్ టికెట్లను పెంచిన టీఎస్ఆర్టీసీ ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 చొప్పున పెంచేసింది. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడు బస్సుల్లో రూ.10 వరకు టికెట్ రేట్లను పెంచింది. ఇలా వరుసగా భారం మోపుతూ వస్తున్న ఆర్టీసీ తాజాగా రిజర్వేషన్ ఛార్జీలు పెంచడంపై ప్రయాణీకులు మండిపడుతున్నారు.