అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశం
మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశించారు. హైదరాబాదులోని R&B కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలతో పాటు అధికారులకు సూచనలు సలహాలు అందించారు. రాజీవ్ రహదారికి సంబంధించి గోదావరి నది బ్రిడ్జి నుండి ఇందారం క్రాస్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, మొక్కలు నాటడం, బ్యూటిఫికేషన్ పనులు వెంటనే చేపట్టాలని కోరారు. జాతీయ రహదారి 63 పరిధిలోని ఇందారం క్రాస్ రోడ్ నుండి అర్జున గుట్ట వరకు జైపూర్,భీమారం మండల కేంద్రాలలో సెంట్రల్ లైటింగ్, రోడ్లవెడల్పు, సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు.
భీమారం నుండి ఆవడం రోడ్ నూతనంగా నిర్మిస్తున్న పనులు సైతం త్వరగా పూర్తి చేయాలన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్ నుంచి గాంధారివనం వరకు రూ.15 కోట్లతో నూతనంగా రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, నూతన జంక్షన్ల ఏర్పాటు, డివైడర్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ సీఈ, ఎస్ఈ తదితరులు పాల్గొన్నారు.