ప్రాణం మీదకు తెచ్చిన ప్రీ వెడ్డింగ్ షూట్
ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు యువతీ, యువకులు తాపత్రయపడుతున్నారు. దీని కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కాస్తా ఓ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కాబోయే జంట చేపట్టిన ఫ్రీ వెడ్డింగ్ వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లా పూర్మెట్ మండలం కొహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్లో విషాదం నెలకొంది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్ ఎఫెక్టివ్‌గా ఉండటం కోసం పొగ పెట్టారు. దీంతో చెట్టుపైన ఉన్న తేనెటీగలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుపై దాడి చేశాయి. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ ఇండ్లలో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.