పిలుస్తోంది.. ఇంద్ర‌వెల్లి..

అమ‌ర‌త్వం మ‌ర‌ణం కాదు… అది మ‌రో సూర్యోద‌యం…

ఇంద్ర‌వెల్లి ఈ పేరు త‌ల‌చుకుంటే చాలు… ఒళ్లు గ‌గుర్పొడుస్తుంది.. ర‌క్తం స‌ల‌స‌ల మ‌సులుతుంది. అమ‌రుల త్యాగాలు గుర్తుకు వ‌స్తాయి. త‌మ వాళ్ల కోసం బిగించిన పిడికిళ్లు మ‌దిలో మెదులుతాయి. ఇంద్రవెల్లి పేరు వింటేచాలు ఆదివాసీ ప్రజలు, గిరిజనుల్లో సమరోత్సాహం స్ఫురిస్తుంది. త‌మ భూమి త‌మ‌కే కావాల‌ని, ఆ భూములపై హ‌క్కులు కావాల‌ని చేసిన పోరాట‌మూ యాదికొస్తుంది. ఆ పోరాటానికి నేటికి 41 ఏండ్లు…

త‌మ భూముల కోసం.. ఆ భూములకు ప‌ట్టాల కోసం జల్‌, జమీన్‌, జంగిల్‌ నినాదంతో ఐక్యమైన ఆదివాసీ, గిరిజ ఉద్యమ జోడు. అదో హక్కుల పోరు. ఆదిలాబాద్‌ జిల్లాలో సరిగ్గా 41 ఏళ్ల క్రితం.. 1981వ సంవత్సరం ఏప్రిల్‌ 20న జల్‌ – జంగిల్‌ – జమీన్‌ అనే నినాదంతో.. అటవీభూములపై హక్కులు కల్పించాలంటూ ఆదివాసీలు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు. ఈ సభకు వేలాది సంఖ్యలో అదివాసులు తరలివచ్చారు. ప్రభుత్వం నుంచి సభకు అనుమతి లేదంటూ… సభను రద్దు చేసుకోవాలని పోలీసులు ఘీంకరించారు. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయని ఆదివాసీలు సభను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. దీంతో వాగ్వివాదం జరిగింది. ఓ మహిళను పోలీసులు చేయిపట్టి లాగేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని ఆర్డీవోకు వివరించగా ఆయన కాల్పులకు అనుమతిచ్చారు. దీంతో పోలీసులు రెచ్చిపోయి ఆదివాసీలు, గిరిజనులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందమందికి పైగా అమరులయ్యారు. ఆ ప్రాంతంగా ఆదివాసీల నెత్తుటితో తడిసి ఎర్రబడింది. మరికొంతమందికి తూటాలు దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. అయితే 13 మంది మాత్రమే చనిపోయారని నాటి సర్కార్‌ లెక్కలు వేసింది. కానీ అనధికారికంగా 113 మంది ఆదివాసీలు నేలకొరిగారు.

నిషేధాల న‌డుమ నివాళులు..
ఇంద్రవెల్లిలో పోలీసుల మారణకాండ అనంతరం 1982లో పీపుల్స్‌ వార్‌ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో అమరుల జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించారు. 1986 వరకు ప్రతి ఏటా కాల్పులు జరిగిన రోజుల అమల వీరుల సంస్మరణ సభ నిర్వహించి శ్రద్దాంజలి ఘటించేవారు. కాగా అదే ఏడాది గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్లతో అమరవీరుల స్థూపాన్ని పేల్చివేయగా, మూడేళ్ల తర్వాత అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంస్థ నిధులతో మళ్లీ స్థూపాన్ని నిర్మించింది. 1989 తర్వాత స్థూపం దగ్గర సంస్మరణ సభను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రతిఏటా ఏప్రిల్‌ 20న నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. సంస్మరణ దినోత్సవం రోజున 144 సెక్షన్‌ను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ ఏడాది మాత్రం పెద్ద ఎత్తున అమ‌రుల‌కు నివాళులు అర్పించ‌నున్నారు.

హామీల అమ‌లే అస‌లైన నివాళి…
గిరిజ‌నుల‌కు ఇప్ప‌టికి వారి అడవిపై హ‌క్క‌, అధికారం లేవు. వారు సాగు చేసుకుంటున్న భూముల‌కు ప‌ట్టాలు లేవు. ఏవైతే 40 ఏండ్ల కింద‌ట త‌మ వారి కోసం అసువులు బాసిన వారి ఆకాంక్ష నెర‌వేర‌నే లేదు. ఇప్ప‌టికైనా గిరిజ‌నుల‌కు పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇస్తే అదే వారికి అస‌లైన నివాళి. 1981 సంఘటన అనంతరం అప్పటి సీఎం అంజ‌య్య పిట్ట‌బొంగురం గ్రామానికి వ‌చ్చి ఇస్తాన‌న్న న‌ష్ట‌పరిహారం ఇప్ప‌టికీ అందలేదు. కేంద్రమంత్రి హోదాలో పచ్చిన జైరాం రమేశ్ ఇంద్రవెల్లి స్తూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దు తామని, పర్యాటక కేంద్రంగా గుర్తిస్తామని ఇచ్చిన హామీ అలాగే మిగిలిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ తెలం ఆవిర్భావం అనంతరం హరీశ్ రావు ఇంద్ర వెళ్లి స్తూపాన్ని సందర్శించారు. అమరులకు నివాళులర్పించాడు. స్తూపాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like