మెమోలు ఫుల్.. చర్యలు నిల్…?
-ఎంత చేసినా మారని అంగన్‌వాడీ వ్యవస్థ
-అధికారులను సైతం పట్టించుకోని టీచర్లు
-నెలనెలా మామూళ్లు ముట్టచెబుతున్నారనే ఆరోపణలు
-అందుకే చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్న అధికారులు
-ఇప్పటికైనా ప్రక్షాళన చేయాలని పలువురి విజ్ఞప్తి

మంచిర్యాల : పనితీరు విషయంలో అంగన్‌వాడీలపై నిత్యం ఆరోపణలు వస్తున్నాయి. టీచర్లు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడం, సరుకులు అమ్ముకోవడం ఇలా ఎన్నో రకాలైన ఫిర్యాదులు నిత్యం వస్తున్నాయి. కొందరు టీచర్లు అయితే అధికారులను సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీడీపీవోలు, సూపర్‌వైజర్లు టీచర్లతో మిలాఖత్ అవుతున్నారు. అంగన్‌వాడీ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. ఉన్నతాధికారులు వారికి మెమోలు ఇచ్చినా వారి పనితీరులో మార్పు రావడం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
సూపర్‌వైజర్లు, సీడీపీవోల మొద్దు నిద్ర..
అంగన్‌వాడీ కేంద్రాలపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, సీడీపీవోల పర్యవేక్షణ లోపించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు చాలా మంది సమయపాలన పాటించడం లేదు. సక్రమంగా కేంద్రాలు తెరవడం లేదు. దీంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. కేంద్రాలు తెరిచినా వారిలో చాలా మంది భోజనం సక్రమంగా వండి పెట్టడం లేదు. సరుకులు ఉన్న కేంద్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. చాలా కేంద్రాలు సమయానికి తెరువలేదు. తెరిచిన కేంద్రాల్లో పిల్లల సంఖ్య ముగ్గురు, నలుగురే ఉండడం గమనార్హం. పర్యవేక్షించాల్సిన కొంత మంది సూపర్‌వైజర్లు కార్యాలయానికే పరిమితం ఆవుతున్నారు. దీంతో కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు లబ్ధిదారులకు అందజేయాల్సిన కోడిగుడ్లు, ఇతర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. కాని ఏ కేంద్రంలోనూ మెనూ పాటించడం లేదు.
సరుకులు అమ్ముకున్నా చర్యలేవీ..?
గర్భిణులు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలను కొందరు అంగన్‌వాడీ టీచర్లు బయట అమ్ముకుంటున్నరు. గత ఏడాది సీసీసీ నస్పూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వేమనపల్లి, కోటపల్లి, జైపూర్, బీమారం మండలంలోని అంగన్‌వాడీ టీచర్ల వద్ద నుంచి తీసుకువస్తున్నట్లు ట్రాలీ డ్రైవర్ సంతోష్ అంగీకరించాడు. అంగన్‌వాడీ టీచర్లు సరోజ, జయప్రద, రాణి, మణెమ్మ, మరో టీచర్ వద్ద నుంచి వీటిని తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇందులో అసలు సూత్రధారి సీడీపీవో మనోరమను వదిలేసి మిగతా సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకున్నారు. ఇక టీచర్లకు సైతం మెమోలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
లక్షలు చేతులు మారినయ్..
ఆ టీచర్ల విషయంలో లక్షల రూపాయాలు చేతులు మారాయి. కానీ వారి మీద ఈగ కూడా వాలలేదు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. వాటిని రికవరీ చేసుకునేందుకు ఇప్పటికీ ఒక టీచర్ తిరిగి గుడ్లు, పాలు అమ్ముకుంటోంది. ఈ వ్యవహారంలో ఆ ఊళ్లో గొడవలు కూడా అయ్యాయి. అయినా చర్యలు శూన్యం. అక్కడ సీడీపీవో ఈ వ్యవహారంలో టీచర్లకు పూర్తి స్థాయిలో మద్దతు చెబుతుంది అన్నది బహిరంగ రహస్యం. చెన్నూరు ప్రాజెక్టులో ఎన్ని తప్పులు చేసినా బారా ఖూన్ మాఫ్ అన్న చందంగా ఉంది. టీచర్లు ఎన్ని తప్పులు చేస్తే తమకు అంత ఆమ్దానీ అనే పరిస్థితి నెలకొంది. దీంతో టీచర్లు సైతం కొంత అధికారులకు ముట్టచెప్పి వారు యథేచ్ఛగా తమ పని తాము చేసుకుంటున్నారు.
విధులకు హాజరుకాని టీచర్లు..
చాలా చోట్ల టీచర్లు విదులకు సక్రమంగా హాజరు కారు. అయినా వారి గురించి పట్టించుకునే నాథుడే లేడు. బెల్లంపల్లి పట్టణంలో ఓ టీచర్ సంవత్సరాల తరబడి బడి తీయడం లేదు. ఆయా ద్వారా నడిపిస్తుంది. మంచిర్యాలలో ఒక టీచర్ బట్టల షాపులో పనిచేస్తుంది. ఒక టీచర్ భూపాలపల్లిలో ఉంటుంది… ఇక్కడ పనిచేసినట్లు రికార్డుల్లో ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అయినా చర్యలు శూన్యం. ఇందుకు పర్యవేక్షించాల్సిన సూపర్‌వైజర్లు, సీడీపీవోలు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పైగా కొందరు అధికారులకు నెలనెలా డబ్బులు ముడుతాయని అందుకే అంగన్‌వాడీ సెంటర్లను పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులు ఇచ్చినా.. చర్యలు లేవు…
సరకులు అమ్ముకున్న ఐదుగురు టీచర్లకు, సీడీపీవోకు నోటీసులు ఇచ్చారు. అందులో చర్యలు లేవు. ఇక కొద్ది రోజుల కిందట కాసిపేట మండలంలో కలెక్టర్ పర్యటించారు. టీచర్ తరచూ గైర్హాజర్ అవుతున్నారని గ్రహించి తనకు నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. అక్కడ కూడా చర్యలు లేవు. ఇక తాజాగా లక్ష్సెట్టిపేట సీడీపీవో రెష్మాకు నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరి ఇక్కడ అయినా చర్యలు ఉంటాయా..? అనేది అనుమానంగా మారింది. ఇప్పటికైనా అంగన్‌వాడీ వ్యవస్థను గాడిలో పెట్టాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.
అందరినీ కాపాడే అన్న..
అంగన్‌వాడీ వ్యవస్థకు సంబంధించి చెన్నూరు ప్రాంతానికి ఓ రాజకీయనేత అండగా ఉంటున్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఏం తప్పు చేసినా….? ఎవరికి ఏం కావాలన్నా అందరూ ఆయన దగ్గరకు పరిగెత్తుతున్నారు. ఆయన ఆ సమస్య స్థాయిని బట్టి అటు కలెక్టర్‌కు గానీ, మహిళా సంక్షేమ శాఖ కమిషనర్‌కు గానీ ఫోన్ చేస్తారు. దీంతో తమకు ఏం కాదనే భరోసా వారిలో పెరిగిపోయింది. సరుకులు అమ్ముకున్న వ్యవహారంలో కూడా ఆయన ఫోన్ తోనే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అంగన్‌వాడీలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నిస్తే ఫర్వాలేదు.. కానీ, తప్పు చేసిన వారిని కూడా వెనుకేసుని రావడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.