పత్తి విత్తనాల వెనక ప్రభుత్వ ఉపాధ్యాయుడు
-గతంలో అరెస్టైనా మారని తీరు
-పీడీ యాక్టు పెట్టినా అదే దందా
-పలువురితో అమ్మిస్తూ లక్షల్లో సంపాదన

మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం జోరుగా సాగుతోంది. బెల్లంపల్లి కేంద్రంగా ఈ వ్యహారం సాగుతోంది. అమాయకులైన రైతులే లక్ష్యంగా పలువురు వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ దందాపై పోలీసులు కన్నేశారు. గురువారం బెల్లంపల్లి డివిజన్‌లో దాడులు నిర్వహించి పలు చోట్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం వెనక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నట్లు సమాచారం.
జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ఎండాకాలంలోనే కొందరు వ్యాపారులు తీసుకువచ్చి ఇక్కడ నిల్వ చేసుకుని అమాయకులైన రైతులకు అంటగడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో జిల్లాకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతం నుంచి వీటిని తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. విడి విత్తనాలు, సంచుల్లో ప్యాక్ చేసిన నకిలీ విత్తనాలను నేరుగా రైతులకు అంటగడుతున్నారు. కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి రవాణా చేస్తున్నారు. జిల్లాలోని కొందరు డీలర్లతో సత్సంబంధాలు ఉన్న సదరు ముఠా సభ్యులు తక్కువ ధరకు వారికి సరఫరా చేస్తున్నారు. లైసెన్స్‌డ్ డీలర్ల కంటే బయటి వ్యక్తుల వద్ద విత్తనాలు చవకగా లభిస్తుండటంతో రైతులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతుననారు. నాణ్యమైన విత్తనాలతో చేసే సాగుతో పోల్చితే నకిలీ విత్తనాలతో చేసే సాగుకు పెట్టుబడిలో భారీ వ్యత్యాసం ఉండటంతో రైౖతులు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. నకిలీ పత్తి విత్తనాల సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమ దందా కొనసాగుతోంది.
ఆంధ్ర ప్రాంతం నుంచి దిగుమతి
మంచిర్యాల జిల్లాకు ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్దఎత్తున దిగుమతి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి, అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాలను ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు నిత్యావసర వస్తువులు తరలించే వాహనాల్లో చేరవేస్తున్నారు. ఆంధ్ర నుంచి వచ్చి వ్యవసాయం పేరుతో మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలలో నివాసం ఉంటారు. ఇక్కడి భూములను కౌలుకు తీసుకొని వ్యయసాయం చేస్తారు. ఇక్కడి విత్తన డీలర్లు, రైతులతో పరిచయాలు పెంచుకుంటారు. వారికి అనుకూలంగా ఉన్న వారితో ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టుబడటమే దీనికి నిదర్శనం.
ఆ ఉపాధ్యాయుడు ప్రధాన సూత్రధారి..
భీమిని ప్రాంతానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ వ్యవహారం అంతా తన కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే వ్యాపారం చేస్తుండటంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతనిపై పీడీ యాక్టు కూడా నమోదు అయ్యింది. జైలుకు వెళ్లాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇప్పుడు కూడా తనకు సంబంధించిన వ్యక్తులు కొందరు, అమాయకులైన రైతులను ముఠాగా ఏర్పాటు చేసి పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతన్ని అరెస్టు చేసినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా అదే దందా చేస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున నిల్వలు..
బెల్లంపల్లి డివిజన్లోనే పెద్ద ఎత్తున పత్తి విత్తనాలు నిల్వ చేసి ఉంచినట్లు తెలుస్తోంది.ఆంధ్రాప్రాంతానికి చెందిన వారు ఇక్కడ రైతుల పేరుతో పాగా వేసి ఈ ప్రాంత రైతులకు పత్తి విత్తనాలు అమ్ముతున్నారు. భీమిని,నెన్నల,తాండూరు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు ఈ నకిలీ విత్తనాలు అమ్మేందుకు తెచ్చిపెట్టుకున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే రైతులకు అమ్మారు కూడా. భీమిని ప్రాంతానికి చెందిన ఓ రాజకీయనాయకుడు సైతం ఈ పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున తెచ్చారని సమాచారంతో పోలీసులు అటువైపుగా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై దృష్టి సారిస్తే నకిలీ విత్తనాల బెడద పూర్తిగా అరికట్టవచ్చని పలువురు చెబుతున్నారు.