ఆ సర్య్కులర్ ఉపసంహరించుకోవాలి
-లేకపోతే మా యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు
-టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య

మంచిర్యాల : కార్మికులకు అసౌకర్యం కలిగించే సర్క్యులర్ వెంటనే ఉపసంహరించుకోవాలని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. షిఫ్ట్ ప్రారంభ సమయాలలో మాస్టర్ బుకింగ్ సమయాన్ని తగ్గించడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. గత సంవత్సరం కోవిడ్ వ్యాధి ఉద్ధృత స్థాయిలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎంతోమంది మృత్యువాత పడుతున్నా సింగరేణి కార్మికులు ధైర్యంగా విధుల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. భయానక వాతావరణం ఉన్న పరిస్థితుల్లో సైతం సింగరేణి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. భద్రతా పరమైన చర్యలు లోపించి పలు ప్రమాదాలు జరుగుతున్నా వెరవకుండా ఉత్పత్తి లక్ష్యసాధనలో ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. గత సంవత్సరం లక్ష్యాన్ని ఛేదించి సింగరేణి చరిత్రలోనే అత్యధిక లాభాలు అందించే విధంగా పనిచేశారని చెప్పారు. అటువంటి కార్మికులకు ప్రోత్సహించి ఉత్సాహపరిచే చర్యలు తీసుకోవాలని, కానీ సింగరేణి యాజమాన్యం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ రకంగా షిఫ్ట్ సమయాలను ఇష్టానుసారం మార్చడం సరికాదన్నారు. దీనివల్ల కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతిని ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సరికాదని యాజమాన్యానికి హితవు పలికారు. వెంటనే జారీ చేసిన సర్య్కులర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాడుతామని ఆయన హెచ్చరించారు.