కలలు కనాలి.. సాకారం చేసుకోవాలి..
యువతకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపు
మంచిర్యాల :యువత కలలు కనాలని వాటిని సాకారం చేసుకోవాలని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ ప్రారంభోత్సవం, ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో చదవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోగలరని అన్నారు. యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనవసరమైన మాటలు విని యువకులు గందరగోళానికి గురి కాకూడదు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో ఇలాంటి అవకాశాలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. కష్టపడితేనే ప్రతిఫలం లభిస్తుందన్నారు. 95% ఉద్యోగాలు స్థానికులకే కల్పించిన ఘనత తెరాస ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, జోన్ల వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని ఆయన వెల్లడించారు.
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ధనార్జన తప్ప కనీసం సిలబస్‌పై కూడా అవగాహన ఉండదని అన్నారు. పట్టుదల వదలకుండా చేసే మీ ప్రయత్నమే.. రేపటి మీ భవిష్యత్తును నిలబెడుతుందని చెప్పారు. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. మీ శక్తి కూడబెట్టి శక్తిమంతులు అవుతారా..? బలహీనులుగా మిగిలిపోతారా మీరే నిర్ణయించుకోవాలన్నారు.ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను తప్పక పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. మీ గమ్యం చేరేవరకు ఇంటర్నెట్, సినిమాలాంటి విషయాలు పక్కనపెట్టి లక్ష్యంతో ముందుకు కొనసాగాలని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, జడ్పి చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా పాలనాధికారి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు.