టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
మంచిర్యాల : చెన్నూరులో బీజేపీ నేతలపై దాడి వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పదిమంది నేతలపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 30న మిర్చి కల్లాల పరిశీలనకు వెళ్లిన పలువురు బీజేపీ నాయకులపై దాడి జరిగింది. బీజేపీ నాయకుడు అందుగుల శ్రీనివాస్‌తో సహా కొందరు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ దాడులు టీఆర్ ఎస్ నేతలే చేశారని బీజేపీ ఆరోపించగా, అందులో తమకు ఏం సంబంధం లేదని రైతులే దాడులు చేశారని టీఆర్ ఎస్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు ఇచ్చినా కనీసం పట్టించుకోవడం లేదని కేసులు నమోదు చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. తాజాగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసి దాడి విషయంలో ఆయనతో చర్చించడమే కాకుండా, ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించి పది మంది నేతలపై కేసులు నమోదు చేశారు.
టీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, జగన్నాథుల శ్రీనివాస్, వేల్పుల సుధాకర్, నాయకులు పెండ్యాల లక్ష్మణ్, తలారి మురళి, ఆసంపల్లి సంపత్, మారిశెట్టి విద్యాసాగర్ దాడికి పాల్పడినట్లు బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.