పనులు వేగవంతం చేయండి
ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును కలిసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. గురువారం ఆయన జలసౌధలో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ఎత్తిపోతల పథకానికి పాలనా పరమైన అనుమతులు లభించిన నేపథ్యంలో మిగతా పనులు త్వరగా చేయాలని కోరారు. సాంకేతిక అనుమతులు, టెండర్ ప్రక్రియకు పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్ ఇన్ చీఫ్ కు వెల్లడించారు. దీనికి ఈఎన్సీ సానుకూలంగా స్పందించారని పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని చెప్పినట్లు విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సాకారంతో రైతుల కలలు నెరవేరబోతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి 10 టీఎంసీల నీటిని కేటాయిస్తూ, మూడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. ఎత్తిపోతల పథకం పూర్తయితే చెన్నూర్ నియోజకవర్గంలోని 98 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేయడంతో పాటు పది టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, పనులు త్వరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వ విప్ వెంట పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.