ఎన్ఎస్యూఐ నేతలతో రాహుల్ ములాఖత్
హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. జైలులో ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. వారిని పరామర్శించి పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పోరాడాలని.. మీ వెంట మేమున్నామని ఎన్ఎస్యూఐ నేతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఓయూలో ధర్నా చేసిన ఎన్ఎస్యూఐ నేతలను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.అయితే మొదటగా జైలులో ములాఖత్‌కు రాహుల్‌గాంధీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు. పలువురు కాంగ్రెస్ నేతలు కోరిన మీదట ఈ ఉదయం అనుమతి లభించింది. రాహుల్‌తోపాటు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మాత్రమే జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైలుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు చేపట్టారు. రాహుల్ ములాఖత్ ముగిసే వరకూ జైలులో సాధారణ ములాఖత్‌లను నిలిపివేశారు.