అమ్మ పాదాలకు పూజ.. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం…
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను ప్రారంభించి, సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే తన తల్లికి పాద పూజ చేశారు. ఇదే సమయంలో 2022 మంది తల్లులకు తమ పిల్లలు పాదపూజ చేశారు. ఒకేసారి 2022 మంది మాతృమూర్తులకు పాదపూజ చేయడాన్ని ‘గోల్డెన్ స్టార్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ లో స్థానం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం, మెడల్ నిర్వాహకురాలు రంగజ్యోతి ఎమ్మెల్యేకు అందించారు. అనంతరం మాతృ దినోత్సవ పాటల సీడీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తెలంగాణ కళాకారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.
వేలాది మంది మాతృమూర్తుల నడుమ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఎక్కడా లేని విధంగా మాతృ మూర్తులకు మహా పాద పూజ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ స్ఫూర్తితో చేశానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తల్లిని గౌరవించడం సనాతన సంప్రదాయమని గుర్తు చేశారు.