జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి కూతురు మృతి

కొత్త జీవితం పై కోటి ఆశలు పెట్టుకుంది. తనకి కాబోయే వాడితో ఎడడుగులు నడవాలని కలలు కన్నది.. తనకు నచ్చిన వాడు జీలకర్ర బెల్లం పెడ్తుంటే మురిసిపోయింది.. కానీ అంతలోనే ఆ జంటను చూసి విధికి కన్నుకుట్టింది.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన పెళ్లి కూతురుకి..పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపువస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు..తీరని దుఃఖం మిగిలింది. పెళ్లిపీటలపై కూర్చున్న నవవధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందిన ఘటన విశాఖలో గురువారం వెలుగు చూసింది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు.
బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెళ్లి కూతురు సృజన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే సృజన మృతికి గల కారణాలు తెలియరాలేదు. అలిసిపోయిన పెళ్లి కూతురుకి గుండె పోటు వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.