జీఎం (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బాధ్యతల స్వీకరణ
సింగరేణి కాలరీస్‌లో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మార్కెటింగ్, సేల్స్ విభాగానికి సంబంధించిన డీజీఎంలు ఎన్.వి.రాజశేఖరరావు,తాడబోయిన శ్రీనివాస్,సత్తు సంజయ్,అధికారులు,ఉద్యోగులు స్వాగతం పలికారు. గతంలో జీఎం (మార్కెటింగ్)గా పనిచేసిన రవిశంకర్ పదవీ విరమణ నేపథ్యంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎంగా పనిచేస్తున్న సురేశ్‌ను జీఎం (మార్కెటింగ్)గా నియమించారు.
అనంతరం జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎం.సురేశ్ ఉద్యోగులతో మాట్లాడుతూ సింగరేణితో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎటువంటి కొరత లేకుండా బొగ్గు సరఫరా చేస్తున్నామన్నారు. దీనిని మరింత మెరుగుపరచడానికి ఏరియాల జీఎంలతో సమన్వయం చేస్తూ కృషి చేయాలని కోరారు. అనంతరం ఏరియాలలోని వివిధ సీహెచ్ పీల ద్వారా రవాణా అవుతున్న బొగ్గు వివరాలను, రేకుల సంఖ్యపై అధికారులతో సమీక్షించారు. ప్రధాన వినియోగదారులైన థర్మల్ విద్యుత్ కేంద్రాలతోపాటు ఇతర వినియోగదారులకు కూడా సాధ్యమైనంత వరకు బొగ్గు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.