పోలీస్స్టేషన్ ముట్టడికి బయల్దేరిన మహిళలు : అడ్డుకున్న పోలీసులు
మంచిర్యాల:పోలీస్స్టేషన్ ముట్టడికి బయల్దేరి వెళ్లిన మహిళలను పోలీసులు మద్యలోనే అడ్డుకున్నారు. పోలీస్స్టేషన్ వద్దకు రాకముందే వాళ్లను అడ్డుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినని మహిళలు పోలీసులు అడ్డుకున్న చోటే ఆందోళన నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో నకిలీ పత్తి విత్తనాల వ్యవహారంలో ఇందూరి అంకయ్య రైతును పోలీసులు స్టేషన్ పిలిపించారు. అక్కడ అతన్ని విపరీతంగా కొట్టినట్లు ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. అవమానం భరించలేక అంకయ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇందూరి అంకయ్య బంధువులు, కొందరు గ్రామస్తులు కలిసి పోలీస్స్టేషన్ ముట్టడించేందుకు బయల్దేరి వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని నెన్నల టీ రోడ్డు వద్ద ఆపేశారు. పక్కనే ఉన్న మామిడి తోటలోకి తీసుకువెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు వినకుండా తమకు న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.