టీఆర్ఎస్ వల్లే మీకు రాజకీయ భిక్ష
-పార్టీ మారగానే మాట మారుతుందా..?
-సుమన్‌పై చేసిన ఆరోపణలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలి
-జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్
మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ వల్లనే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ఎదిగారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ దుయ్యబట్టారు. గురువారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ వేధింపుల వల్లే టిఆర్ఎస్=ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చేసిన ఆరోపణలు సరికాదన్నారు. పార్టీ మారగానే మాట మార్చుతున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ వల్లే నల్లాల భాగ్యలక్ష్మి జడ్పీ చైర్పర్సన్ అయిందని వారు గుర్తు చేశారు. నల్లాల ఓదెలు ఎమ్మెల్యే అయినా అభివృద్ధి చేయలేక ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ అధిష్టానం బాల్క సుమన్ను అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేశాననే విశ్వాసంతో ఎమ్మెల్యేగా తనను రెండుసార్లు గెలిపించారని కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన ఓదెలు కాంగ్రెస్ లో చేరగానే కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు చేయడం సముచితం కాదని వారికి హితవు పలికారు. సుమన్పై చేసిన ఆరోపణలను బేషరతుగా ఓదెలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.