తప్పు చేయలేదు… గొప్పగా భావిస్తున్నా..
-సుమన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా
-ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయలేదు
-అనుచరులతో బెదిరించే ప్రయత్నం చేశారు
-ప్రజలంతా మా వెంటే ఉన్నారు.. సమయం కోసం వేచి ఉన్నారు
-మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు
మంచిర్యాల : పార్టీ మారి తప్పు చేయలేదని గొప్పగా భావిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత నల్లాల ఓదెలు స్పష్టం చేశారు. పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పారాయన. టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ వ్యవహరించిన తీరు నచ్చకనే పార్టీ మారినట్లు వెల్లడించారు. తాను ఆ వ్యవహార శైలి అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదన్నారు. ఉద్యమ కాలం నుంచి పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వలేదని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ వీడాలంటనే బాధగా ఉందని, కానీ తప్పడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పు కాదని చెప్పారు. తెలంగాణ తల్లిని విముక్తం చేసిన సోనియా దగ్గరికి పోయినా తప్ప, తెలంగాణకు ద్రోహం చేసిన ఎవరి దగ్గరకు పోలేదని వెల్లడించారు. నేను చేసింది తప్పు అనుకోవడం లేదు.. గొప్పగా భావిస్తున్నానని చెప్పారు. 2018లో నాకు టిక్కెట్టు ఇవ్వకపోతే బాధ అనిపించింది. అప్పుడు పార్టీ తరఫున ఇంద్రకరణ్‌రెడ్డి, అరవిందరెడ్డి మాట్లాడారు. పార్టీ మీకు సముచిత స్థానం కల్పిస్తుందటే నేను నమ్మినా అని చెప్పారు. సుమన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినట్లు స్పష్టం చేశారు. తాను ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయలేదని, వ్యతిరేకంగా పోలేదని చెప్పారు.
తన భార్యకు జడ్పీ చైర్పర్సన్ గా ప్రకటించే విషయంలో కూడా సుమన్ ముందుకు రాలేదన్నారు. ఆయన మేడి సునితను జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేయాలని భావించారని చెప్పారు. ఆమె ఎక్కడ తెలంగాణ జెండా పట్టారు. ఆమె ఎక్కడ ఉద్యమం చేశారో సుమన్ చెప్పాలన్నారు. ఆమె పేరు ప్రకటించినా నేను బాధపడి సైలెంట్‌గానే ఉన్నానని అన్నారు. అప్పుడు కూడా మళ్లీ ఇంద్రకరణ్‌రెడ్డి, అరవిందరెడ్డి, జిల్లాలోని ముఖ్య నాయకులు అధిష్టానానికి చెప్పారన్నారు. కేటీఆర్ ఓ పెళ్లిలో వేరే వాళ్లకు ఇవ్వొద్దని తెలంగాణ ఉద్యమకారుడు ఓదెలుకే ఇవ్వాలని చెప్పడంతో మాకు ఆ పదవి వచ్చిందన్నారు. కేటీఆర్ బాల్క సుమన్‌ను తిట్టి, సీరియస్‌గా చెప్పడంతో అప్పుడు నేను టిక్కెట్టు ఇచ్చినా అని సుమన్ నాతో చెప్పారని అన్నారు.
మరోవైపు జడ్పీటీసీగా పోటీ చేసే సమయంలో కూడా మందమర్రి నుంచి పోటీ చేస్తామంటే కాదని, కోటపల్లి నుంచి బలవంతంగా పోటీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు అధిష్టానం రూ. 1.50 కోట్లు ఇస్తే వాటిని కేవలం జడ్పీటీసీల కోసం ఖర్చు చేయించారని తెలిపారు. నా దగ్గర డబ్బులు ఉండొద్దనే ఉద్దేశంతోనే వాటన్నింటిని ఖర్చు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేకుండా ఉంటేనే నా వద్దకు ఎవరూ రారనే ఉద్దేశంతో ఇలా చేశారని అన్నారు.
తన అనుచరులను పంపించి నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయించారని అన్నారు. నువ్వు ఇక్కడ ఉంటే అందరూ వస్తారు, మంచిర్యాలలో కిరాయి తీసుకుని ఉండు అని బెదిరించారని వెల్లడించారు. వచ్చిన వాళ్లకు తాటాకు చప్పుళ్లకు బెదిరే వ్యక్తిని కాదని చెప్పినా అని స్పష్టం చేశారు. మందమర్రి వదిలిపెట్టి పోనని, అవసరం అయితే పార్టీకి రాజీనామా చేస్తానని జడ్పీ చైర్పర్సన్ పదవి వదిలిపెట్టిపోనని చెప్పినా అన్నారు. తనకు పదవి ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్ అన్నారు. తనకు వరుసగా జరుగుతున్న అన్యాయాలను అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదన్నారు.
తనపై సోషల్ మీడియాలో ఎదురు దాడి చేస్తున్న తమ్ముళ్లను తన వాళ్లుగానే చూస్తున్నానని చెప్పారు. నా తమ్ముళ్లు, నా వాళ్లు అన్నారు. ప్రజలంతా మా వెంటే ఉన్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారని స్పష్టం చేశారు.